ఎన్ని కుట్రలు చేసినా ఈటల గెలుపును అడ్డుకోలేరు 

టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో ఈటల గెలుపును అడ్డుకోలేరని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని చెప్పారు. అయితే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొంటున్నారని  హన్మకొండ జన ఆశీర్వాద యాత్రలో తెలిపారు. ని హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు.

ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా హుజూరాబాద్‌లో కమలం పువ్వు గుర్తు జెండాయే ఎగురుతుందని కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. ఎన్నికల పేరిట సీఎం కేసీఆర్‌ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గాన్ని రాజకీయ అంగడి చేసి ప్రజాప్రతినిధులు, నాయకులను పశువుల్లా కొంటున్నారని ఆరోపించారు. 

ఇవి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అభివర్ణించారు. ఇక్కడ ఈటలను గెలిపిస్తే 2023లో తెలంగాణలో తాను బీజేపీ ప్రభుత్వాన్ని తెస్తానని స్పష్టం చేశారు. ఈ ఎన్నిక ఒక్క ఈటలది కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినదని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును తన పంతాలు, పట్టింపుల కోసం అప్పనంగా ఖర్చు చేస్తున్న సీఎంకుS తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.  

నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబానికే పరిమితమైందని, కల్వకుంట్ల కుటుంబంలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజల సొమ్మును తండ్రీకొడుకులు కలిసి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఓవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ దాటి బయటికి రావడంలేదని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో ఇక్కడ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజలు తన బానిసలు అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.  కానీ, 1200 మంది బిడ్డలు బలిదానాలు చేసింది కేసీఆర్‌ కుటుంబానికి ప్రజలు బానిసలుగా ఉండేందుకు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు. ఆత్మగౌరవం లేనివారు, బానిసలుగా ఉండేవారు మాత్రమే టీఆర్‌ఎటస్‌లో ఉండాలని భావిస్తున్నారని అర్పిస్తూ, ఆత్మగౌరవం ఉన్నవారిని ఆ పార్టీలో ఉండనివ్వడంలేదని ఆరోపించారు.

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా కష్టకాలంలో మోదీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని కిషన్‌రెడ్డి చెప్పారు. డిసెంబర్‌ నాటికి అందరికీ వ్యాక్సిన్‌ అందజేయాలన్నదే కేంద్ర సర్కారు ధ్యేయమని తెలిపారు. కరోనా దృష్ట్యా దేశంలోని సుమారు 80 కోట్ల కుటుంబాలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నామని గుర్తు చేశారు. 

వరంగల్ ఎయిర్‌పోర్ట్ కోసం తాము కట్టుబడి ఉన్నామని చెబుతూ ఈ విషయమై కెసిఆర్ స్పందించాలని నిలదీశారు. కాకతీయుల కళా సంపద ప్రాచీన కట్టడాలను గత ప్రభుత్వాలు నిర్లక్షం చేశాయని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర మహబూబాద్ జిల్లా తొర్రూరులోనూ, అనంతరం వర్ధన్నపేట మీదుగా కొనసాగింది.

కాకతీయ కళాసంపదను రక్షిస్తా

కేంద్ర పర్యాటక మంత్రిగా కాకతీయ కళాసంపదను రక్షిస్తానని  కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల  కిషన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వేయిస్తంభాల కల్యాణమండం నిర్మాణం ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉందని చెబుతూ  ఆ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు.

వరంగల్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.రామప్పకు యునెస్కో గుర్తింపు వెనుక ప్రధాని మోదీ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. కాకతీయుల కళాసంపద ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశారని కొనియాడారు.

మంత్రి కిషన్‌రెడ్డి వేయిస్తంభాల గుడిని సందర్శించిన సందర్భంగా హన్మకొండ నగరంలోని భద్రకాళి ఆలయం పర్యాటక కేంద్రంగా మారనుందని, ఇందులో భాగంగానే హృదయ్, స్మార్ట్ సిటి పథకం నిధులతో భద్రకాళి బండ్ అభివృద్ధి చెందిందని తెలిపారు. 

అతిపురాతన, కాకతీయుల నాటి ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆలయం వేయిస్తంభాల గుడి అని చెబుతూ. భద్రకాళి దేవాలయానికి, వేయిస్తంభాల రుద్రేశ్వరాలయానికి ఎంతో అనుబంధం ఉందని, ఈరెండు దేవాలయాలు కాకతీయుల కాలంలో నిర్మితమైనవేనని పేర్కొన్నారు. జిల్లాని దేవాలయాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.