తీరు మారని తాలిబన్ల కిరాతకం… ఆమ్నెస్టీ స్పష్టం

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల కిరాతకం కాబుల్ ను స్వాధీనం చేసుకోవడానికన్నా ముందే,  జులైలోనే మొదలైందని మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఆ నెల మొదట్లో హజారా మైనారిటీల ఇళ్లలోకి చొరబడి లూటీ చేసిన తాలిబన్లు తొమ్మిది మందిని అత్యంత కిరాతకంగా చంపారని తెలిపింది. 

జులై 4-5 మధ్య మాలిస్థాన్ జిల్లాలోని ముండరఖ్త్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పేర్కొంది. ఈ ఘటనకు సాక్షీభూతంగా నిలిచిన పలువురితో మాట్లాడినట్టు కూడా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వివరించింది. ఆరుగురు హజారా పురుషులను తాలిబన్లు కాల్చి చంపగా, ముగ్గురిని దారుణంగా హింసించి చంపారని పేర్కొంది.

జనాభా పరంగా హజారా సామాజిక వర్గానిది ఆఫ్ఘనిస్థాన్‌లో మూడో స్థానం. వీరు షియా ఇస్లాంను పాటిస్తారు. సున్నీ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లలో వీరు వివక్ష, హింసను ఎదుర్కొంటున్నారు. తాజా ఘటనపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కాలమార్డ్ మాట్లాడుతూ ఈ దారుణ హత్యలు తాలిబన్ల గత చరిత్రను గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది సూచన అని స్పష్టం చేశారు. 

జులై 3న ఘజ్ని ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ పోరు మధ్య 30 కుటుంబాలు ఇళ్లను వదిలి బీడు భూములు, పర్వత ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నాయి. అయితే, ఆహార పదార్థాలు నిండుకోవడంతో తిరిగి తీసుకెళ్లేందుకు కొందరు మహిళలు, పురుషులు కలిసి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే, అప్పటికే తమ ఇళ్లను తాలిబన్లు లూటీ చేసి ధ్వంసం చేయడాన్ని చూసి హతాశులయ్యారు.  

అలాగే, ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం కోసం పనిచేసిన 63 ఏళ్ల వ్యక్తిని అతడి స్కార్ఫ్‌తోనే గొంతు బిగించి చంపేసినట్టు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. అతడి చేతి కండరాలను దారుణంగా కోసి చంపేశారని పేర్కొన్నాడు. చాలా మృతదేహాలను సమీపంలోని వాగుల్లోకి విసిరేశారు. కాళ్లు చేతులు విరిగిన వారిని, తీవ్రంగా గాయపడిన వారిని పాతిపెట్టేశారు.  

ఇలా ఎందుకు చేస్తున్నారని తాలిబన్లను అడగ్గా.. పోరు ఉద్ధృతమైనప్పుడు ప్రతి ఒక్కరు చస్తారని, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? లేవా? అన్నది సమస్య కాదని వారు బదులిచ్చారని ప్రత్యక్ష సాక్షులు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు తెలిపారు. 

సంప్రదాయ, మతపరమైన మైనారిటీలకు తాలిబన్ల పాలనలో ముప్పు తప్పదని ఈ లక్ష్య హత్యలు చెబుతున్నాయని ఆగ్నెస్ కాలమర్డ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్యల విషయం బయటకు పొక్కకుండా తాలిబన్లు ఆ ప్రాంతంలో మొబైల్ ఫోన్ల సర్వీసులను నిలిపివేసినట్టు చెప్పారు.