ఐఎస్ఐ ఆదేశంతో భారత కాన్సులేట్లపై తాలిబన్లు దాడి!

తాలిబన్లు భారత కాన్సులేట్లలో గాలింపు చర్యలు చేపట్టి, అక్కడున్న బులెట్ ప్రూఫ్ కార్లను,  అధికారిక పత్రాలను తీసుకెళ్లిన్నట్లు వెల్లడైనది. కాంద‌హార్‌, హీర‌త్ న‌గ‌రాల్లో ఉన్న భార‌తీయ దౌత్యకార్యాల‌ను బుధ‌వారం తాలిబ‌న్లు ముట్ట‌డించిన‌ట్లు తెలుస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ లో భారత దేశ ప్రయోజనాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో పాకిస్థాన్ ఐఎస్ఐ ఇచ్చిన ఆదేశాలపై తాలిబన్లు ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా అక్కడున్న కంప్యూటర్లను నిశితంగా పరిశీలించారని చెబుతున్నారు.

ఆ కార్యాల‌యాల్లో ఉన్న పేప‌ర్ల‌ను, పార్క్ చేసిన కార్ల‌ను తీసుకువెళ్లిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఆ కార్లలో ఎక్కువగా బులెట్ ప్రూఫ్ కావడంతో వాటిపై వారి కన్ను పడింది.  రెండు కాన్సులేట్ల‌లో ఉన్న అన్ని వ‌స్తువుల్ని వాళ్లు ప‌రిశీలించారు. తాలిబన్లు కాందహార్, హెరాత్‌లలోని భారత కాన్సులేట్లలోకి దౌర్జన్యంగా ప్రవేశించినట్లు ఆ కార్యాలయాల వద్ద ఉన్న భద్రతాధికారులు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భార‌త్‌కు చెందిన నాలుగు దౌత్య కార్యాల‌యాలు ఉన్నాయి. కాబూల్‌లో అద‌నంగా మ‌రో ఎంబ‌సీ ఉన్న‌ది. కాంద‌హార్‌, హీర‌త్‌తో పాటు మ‌జార్ యే ష‌రీఫ్ ప‌ట్ట‌ణంలోనూ భార‌తీయ కాన్సులేట్ ఉంది. అయితే తాలిబ‌న్ మిలిటెంట్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి కొన్ని రోజుల ముందే మ‌జార్ యే ష‌రీఫ్ కాన్సులేట్‌ను మూసివేశారు. మూడు రోజుల్లోనే ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని త‌ర‌లించిన‌ట్లు రాయ‌బారి రుద్రేంద్ర టండ‌న్ తెలిపారు.

రాజధాని నగరం కాబూల్‌ను తాలిబన్లు ఆగస్టు 15న స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ దేశంలోని కాన్సులేట్ కార్యాలయాలను భారత ప్రభుత్వం మూసేసింది. ఈ కార్యాలయాల్లో పని చేస్తున్న దౌత్యవేత్తలు, సిబ్బందిని భారత ప్రభుత్వం స్వదేశానికి రప్పిస్తోంది. గ‌త ఆదివారం కాబూల్‌ను చేజిక్కించుకున్న తాలిబ‌న్లు ఆ న‌గ‌రంలో డోర్ టు డోర్ త‌నిఖీ చేప‌డుతున్నారు. జాతీయ భ‌ద్ర‌త విభాగం కోసం ప‌నిచేసిన వారి స‌మాచారాన్ని సేక‌రిస్తున్నారు.