ఇనుప కంచెలపై పిల్లలను విసిరివేస్తున్న ఆఫ్ఘన్ తల్లులు 

ఇనుప కంచెలపై నుండి తమ పిల్లలను విసిరేస్తూ కనీసం తమ పిల్లలనైనా ‘కాపాడండి ప్లీజ్‌…’ అంటూ ఆఫ్ఘన్ తల్లులు వేడుకుంటున్నారు. దేశం విడిచి వెళుతున్న పౌరులపై తాలిబన్‌లు దాడులు చేయడంతో పాటు కాబూల్‌ విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. 
 
దీంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలు కాపాడమంటూ అమెరికా, బ్రిటన్‌ దళాలను వేడుకుంటున్నారు. తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుండి పిల్లలను లోపలికి విసిరేస్తున్నారు.  ఆ దేశ మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. దేశం విడిచి పోయేందుకు పిల్లలు, కుటుంబంతో కలిసి మహిళలు పెద్ద సంఖ్యలో కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని మూసి ఉన్న గేట్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. 
 
ఎయిర్‌పోర్ట్‌ వద్ద సెక్యూరిగా ఉన్న అమెరికా, బ్రిటన్‌ సైనికులను మహిళలు ప్రాధేయపడుతున్నారు. ‘దయ చేసి సహాయం చేయండి.. తాలిబన్లు మా కోసం ఇళ్లకు వస్తున్నారు’ అంటూ మహిళలు చేసిన ఆక్రందనలు మిన్నంటాయి. కనీసం తమ పిల్లలనైనా తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.
 
ఈ హృదయ విదారకమైన ఘటనలు చూస్తుంటే మనసు ఆవేదనతో నిండిపోయిందని బ్రిటన్‌ ఆర్మీ సీనియర్‌ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.  కొందరు మహిళలు ఇనుప కంచెల పైనుంచే పిల్లలను విసిరేసి విదేశీ దళాలను పట్టుకోమని అడుగుతున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్నారులు కంచెలో చిక్కుకుంటున్నారు అంటూ ఒక బ్రిటన్‌ అధికారి మీడియాకు చెప్పారు. ఆ దఅశ్యాలు ఎంతగానో కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, బ్రిటన్‌ ప్రత్యేక బృందాలను పంపిన సంగతి తెలిసిందే. వీరు కాబుల్‌ విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తమ దేశీయులను తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నారు. కాగా,  గందరగోళం, ఆందోళనకర పరిస్థితులు లేకుండా ప్రజలు ఆఫ్ఘనిస్తాన్‌ను వీడి వెళ్లడం సాధ్యం కాదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పష్టం చేశారు. ప్రజలు దేశం విడిచి వెళ్లేందుకు తాలిబన్‌లు అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని అమెరికా కోరింది. 
 
అయితే వీలైనంత ఎక్కువమందిని అక్కడి నుండి తీసుకువచ్చేందుకు యత్నిస్తామని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ ప్రకటించారు కానీ విమానాశ్రయంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో తాలిబన్‌లు కఠినమైన ఆంక్షలు విధించారని అంగీకరించారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సేకరించడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. తమ సామర్థ్యం మేరకు తరలింపు కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు 4,800మందికి పైగా అమెరికన్‌లు, ఆఫ్ఘన్‌లను తరలించినట్లు తాత్కాలిక అమెరికా దౌత్య కార్యాలయం పేర్కొంది.