తాలిబన్, పాక్ లకు అంత సీన్ లేదు 

ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో తాలిబ‌న్ల రాజ్యాన్ని త‌ట్టుకోలేక అధ్య‌క్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతుండగా,  ఆ దేశ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ మాత్రం తాలిబ‌న్ల‌కు స‌వాలు విసురుతున్నారు. వాళ్ల‌పై తిరుగుబాటు చేస్తున్నారు. 

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను మింగేసేంత సీన్ పాకిస్థాన్‌కు, పాలించేంత సీన్ తాలిబ‌న్లకు లేద‌ని అమ్రుల్లా స‌వాలు విసిరారు. ఉగ్ర మూక‌ల‌కు త‌ల‌వంచొద్ద‌ని దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. దేశాలు చ‌ట్టాల‌ను గౌర‌వించాలి త‌ప్ప హింస‌ను కాదని స్పష్టం చేశారు. 

” మీ చ‌రిత్ర‌లో అవ‌మానాల‌కు, ఉగ్ర మూక‌ల‌కు త‌ల‌వంచారన్న త‌ల‌వంపుల‌కు తావు లేకుండా చూసుకోండి” అని అమ్రుల్లా స‌లేహ్ ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప్ర‌స్తుతం తాలిబ‌న్ల చేతుల్లో ప‌డ‌కుండా ఉన్న పంజ్‌షిర్ లోయ నుంచే అమ్రుల్లా తిరుగుబాటు ప్రారంభించారు.

“న‌న్ను న‌మ్మిన కోట్ల మందిని ఎప్ప‌టికీ నిరాశ ప‌ర‌చ‌ను. నేను ఎప్పుడూ తాలిబ‌న్ల‌తో చేతులు క‌ల‌ప‌ను” అని కూడా అమ్రుల్లా స్ప‌స్టం చేశారు. తాలిబ‌న్లకు వ్య‌తిరేకంగా ఫైట్ చేసిన త‌న మాజీ గురువు అహ్మ‌ద్ షా మసౌద్ త‌న‌యుడితో అమ్రుల్లా చేతులు క‌లిపారు. ఇప్పుడీ ఇద్ద‌రూ క‌లిసి తాలిబ‌న్ల‌పై గెరిల్లా ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ పంజ్‌షిర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ అటు విదేశీ శ‌క్తులు కానీ, ఇటు తాలిబ‌న్లు కానీ జ‌యించ‌లేక‌పోయారు. ఇప్ప‌టికే తాలిబ‌న్ల నుంచి బ‌య‌ట‌ప‌డిన ఆఫ్ఘ‌న్ సైన్యంలోని జ‌వాన్లు కూడా పంజ్‌షిర్‌కు చేరుకుంటున్నారు.

కాగా, అఫ్గానిస్థాన్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 19న దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశాన్ని ‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్’ గా ప్రకటించారు. 1996 నుంచి 2001 వరకు తమ పాలనలో కొనసాగించిన పేరునే తాలిబన్లు తిరిగి పెట్టడం గమనార్హం.

2001 తర్వాత అమెరికా రక్షణ బలగాలు అఫ్గాన్ ను తమ అధీనంలో తెచ్చుకోవడంతో ఆ పేరును మార్చారు. కానీ ఇప్పుడు మళ్లీ దేశం తమ చేతుల్లోకి రావడంతో తిరిగి పాత పేరునే తాలిబన్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు.