రక్షణ సాంకేతికతలో స్వయం ఆధారిత దేశంగా భారత్

రక్షణ సాంకేతికతలో స్వయం ఆధారిత దేశంగా బారతదేశాన్ని నిలబెట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలని భారతీయ శాస్త్రవేత్తలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు  పిలుపునిచ్చారు. ఆత్మనిర్భరతను సాధించటంతో పాటు ఆధునిక సైనిక సాంకేతిక పరికరాల ఎగుమతుల కేంద్రంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.

బెంగళూరులోని హెచ్.ఏ.ఎల్. కాంప్లెక్స్ ను సందర్శించిన ఉప రాష్ట్రపతి రాబోయే కాలంలో భారత దేశాన్ని వైమానిక. రక్షణ రంగాల్లో శక్తి కేంద్రంగా తీర్చిదిద్దడంలో దేశీయ ఉత్పత్తులు కీలకపాత్ర పోషించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ రక్షణరంగ ఉత్పత్తులు రక్షణ కోసమే తప్ప దాడుల కోసం కాదని స్పష్టం చేశారు.

చరిత్రలో భారత్ ఎప్పుడు సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించిన దాఖలాలు లేవని తెలిపారు. అదే సమయంలో దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మన రక్షణ అవసరాలకు తగిన ఉత్పత్తులు దేశీయంగా రూపొందడం, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుండటం ఆనందదాయకమని తెలిపారు.

అత్యాధునిక క్షిపణులు, ఉపగ్రహాలు, అంతరిక్ష వాహనాలను తయారు చేయగల భారతదేశ సామర్థ్యం గురించి ప్రస్తావిస్తూ  భారతదేశం మొన్నటి వరకూ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతి దేశంగా ఉందని, ప్రస్తుతం ఈ పరిస్థితి క్రమంగా మారుతోందని చెప్పారు. భవిష్యత్ లో క్లిష్టమైన సాంకేతికతల స్వదేశీ అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చాలని పిలుపునిచ్చారు.

అత్యంత క్లిష్టమైన భౌగోళిక, రాజకీయ వాతావరణం కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న అనేక రకాలైన భద్రతా సవాళ్ళను ప్రస్తావించిన ఉప రాష్ట్రపతి, భద్రతా దళాల ధైర్యం, నైపుణ్యాలను ప్రశంసించారు. భారత సాయుధ దళాలు, సవాళ్ళను ఎదుర్కొనేందుకు, అదే సమయంలో భద్రతా సవాళ్ళను గట్టిగా తిప్పికొట్టడానికి పూర్తి సన్నద్ధంగా ఉండేలా వారి నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రక్షణ తయారీలో దేశీయీకరణ, స్వయం ఆధారిత విధానాన్ని ప్రోత్సహించేందుకు రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమైన వాటికి ధీటైన ఉత్పత్తులను భారతదేశంలో తయారు చేస్తోందని, ఈ దిశగా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక భాగస్వామ్యాలు,  బృంద కృషిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

రక్షణ రంగానికి ఎఫ్.డి.ఐ. పరిమితి పెంపు, ఉత్తరప్రదేశ్ – తమిళనాడుల్లో రెండు రక్షణ నడవాల ఏర్పాటు నిర్ణయం, రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రెండు సానుకూల స్వదేశీకరణ జాబితాల నోటిఫికేషన్ వంటి చర్యలు భారతదేశ రక్షణ రంగానికి గొప్ప అవకాశమన్న ఉప రాష్ట్రపతి, భారత వైమానిక రంగం ఇటీవల హెచ్.ఏ.ఎల్.తో చేసుకున్న 83 తేజస్ ఫైటర్ జెట్ ఒప్పందాన్ని ప్రస్తావించారు.

అంతకు ముందు రాష్ట్రపతి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఎల్.సి.ఏ. తేజస్ తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అత్యాధునిక ఆధునిక యుద్ధ విమానాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను అభినందించారు. 4ప్లస్ తరం విమానాలు భారత వైమానిక దళ అవసరాలను తీర్చేందుకు ఇదో శక్తివంతమైన వేదిక అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారి అధునాతన తేలికపాటి హెలికాఫ్టర్, ధ్రువ్, తేలికపాటి కంబాట్ హెలికాఫ్టర్, చీతా/చేతక్ హెలికాఫ్టర్ ల స్థానంలో ఉండే తేలికపాటి యుటిలిటీ హెలికాఫ్టర్ వంటివి ఉపరాష్ట్రపతిని విశేషంగా ఆకట్టుకున్నాయి.

జాతీయ భద్రతకు హెచ్.ఏ.ఎల్, డి.ఆర్.డి.ఓ. ప్రయోగశాలల అద్భుతమైన సహకారాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఎల్.సి.ఏ. ఎం.కె-2, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎ.ఎం.సి.ఏ), ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ (టి.ఈ.డి.బి.ఎఫ్) వంటి మరింత శక్తివంతమైన విమానాల రూపకల్పన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

యుద్ధవిమానాల అవసరాల కోసం ఇకపై భారతదేశం విదేశీ సాంకేతికత మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, హెచ్.ఏ.ఎల్. ఛైర్మన్ ఆర్. మాధవన్, సంచాలకులు అలోక్ వర్మ సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.