కాశ్మీర్ బిజెపి చీఫ్ రైనాకు ఉగ్రవాదుల బెదిరింపులు

ఉగ్ర‌ సంస్ధ ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌)నుంచి త‌న‌కు బెదిరింపులు ఎదుర‌య్యాయ‌ని జ‌మ్ము క‌శ్మీర్ బీజేపీ చీఫ్ ర‌వీంద‌ర్ రైనా వెల్ల‌డించారు. త‌న‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో హెచ్చ‌రిస్తూ టీఆర్ఎఫ్ ప్ర‌క‌ట‌న జారీ చేసింద‌ని ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు తనను అప్ర‌మ‌త్తం చేశాయ‌ని రైనా తెలిపారు.

రాష్ట్రంలో బిజెపికి పెరుగుతున్న ప్రాబల్యంతో ఖంగు తింటున్న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లోయలో శాంతిని భగ్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.  బీజేపీ ఎదుగుద‌ల ఓర్వ‌లేక‌నే ఉగ్ర‌మూక‌లు పేట్రేగుతున్నాయ‌ని విమర్శించారు.

ఉగ్రవాదుల హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, త‌న‌ను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిఘా వ‌ర్గాలు కోరాయ‌ని చెప్పారు. అయితే అటువంటి బెదిరింపులకు తాను భయపడబోమని స్పష్టం చేశారు. గత ఏప్రిల్ లో ఆయనకు పాకిస్థాన్ మొబైల్ నెంబర్ నుండి వచ్చిన వీడియో కాల్ లో తాను ఎల్ఇటి కమాండర్ అని చెబుతూ బెదిరించారని గుర్తు చేశారు. 

గత రెండేళ్లలో జమ్మూ కాశ్మీర్ లో 23 మంది బిజెపి నాయకులను ఉగ్రవాదులు హత్య చేశారని చెబుతూ, ఆ విధంగా చేయడం ద్వారా ప్రజలలో పార్టీ పట్ల భయం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఇదంతా బిజెపికి పెరుగుతున్న మద్దతు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులతో అసహనాన్ని కలిగిస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని చెప్పారు. 

అయితే అమాయకమైన త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఇటీవ‌ల ఉగ్ర‌వాదులు చంపిన ఘ‌ట‌న‌లను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు రేకెత్తించేందుకే ఉగ్ర‌వాదులు విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. ఈ నెల‌లో ఉగ్ర‌వాదులు బీజేపీ నేత జావీద్ అహ్మ‌ద్ ద‌ర్‌ను కుల్గాంలో దారుణంగా హ‌త్య చేయ‌గా వారం రోజుల వ్య‌వ‌ధిలోనే అనంత‌నాగ్‌లో గులాం ర‌సూల్ ద‌ర్‌ను అంత‌మొందించారు.

అయితే అటువంటి బెదిరింపులకు బిజెపి భయపడబోదని స్పష్టం చేస్తూ జమ్మూ కాశ్మీర్ లో శాంతి, అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటామని రైనా చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో బిజెపి బలం పుంజుకొంటున్నదని చెబుతూ వచ్చే ఎన్నికలలో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కాగా, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల చర్యలను సమర్థించిన జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీడీపీ అధినేత ముప్తి కశ్మీరులో రాజకీయంగా పట్టు కోల్పోయారని బిజెపి నేత నిర్మల్ సింగ్ ధ్వజమెత్తారు. ఆమె నైరాశ్యంలో కూరుకుపోయారని చెప్పారు. 

ఆమె తమను బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటే, ఇది మోదీ భారత దేశమని అర్థం చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఆ రోజులు పోయాయని, తమను బ్లాక్‌మెయిల్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.