ఇస్లాం పరువు తీస్తున్న తాలిబాన్‌

ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబాన్‌పై అజ్మీర్‌ దర్గా దివాన్‌ సూఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇస్లాం మతం పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ క్రూరులైన తాలిబాన్‌ చేతుల్లోకి రావడం విచారకరమని పేర్కొన్నారు. షరియా చట్టం పేరుతో రాక్షస చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు.

షరీయత్ పేరుతో తాలిబాన్ ఉగ్రవాదం చేస్తున్నారని సూఫీ సెయింట్‌ ఖ్వాజా గరీబ్‌ నవాజ్‌ దర్గా దివాన్‌ సయ్యద్‌ జైనుల్‌ అబెదిన్‌  మండిపడ్డారు. వీరు తమ చేష్టల ద్వారా ఇస్లాం పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్ తీవ్రవాద, నియంతృత్వ కార్యకలాపాలు ప్రపంచంలో ఇస్లాం పట్ల ద్వేషాన్ని వ్యాపింజేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

అజ్మీర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ క్రూరమైన తాలిబాన్ పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని విచారం వ్యక్తం చేశారు. దాంతో అక్కడ భారీ విధ్వంసం, మహిళలపై ఆంక్షలు పెరిగిపోయాయని తెలిపారు. షరియా చట్టం పేరుతో ఇదంతా చేయడం ఇస్లాంలో నేరం అని, ఇలాంటి చర్యలకు మద్దతు ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. 

సాధారణ పౌరులు, మహిళలు, పిల్లలు, అమాయక ప్రజల్ని చంపడాన్ని షరియత్‌ చట్టం ఎప్పుడూ అనుమతించదని తేల్చి చెప్పారు. అన్ని దేశాల్లోని ముస్లింలు తమ ప్రాథమిక హక్కులను గౌరవప్రదంగా పొందడానికి షరియా చట్టానికి కట్టుబడి ఉన్నారని అబెదిన్‌ చెప్పారు.  సోదరులు, సోదరీమణులు.. ముఖ్యంగా భారతదేశంలోని యువత మతం పేరిట ఎలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడవద్దని భారతీయ ముస్లింగా విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. మన దేశం భద్రంగా ఉంటేనే మనం భద్రంగా ఉంటామన్నది మరిచిపోవద్దని ఆయన సూచించారు.