ఆఫ్ఘన్ నుండి తరలింపు కష్టతరం 

మరోవంక, ఆఫ్ఘన్‌ నుండి పౌరుల తరలింపు అత్యంత కష్టతరమైనదని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. ఒక్క అమెరికన్‌ కూడా వదలబోమని చెప్పారు. ఆఫ్ఘన్‌ నుండి వాయు మార్గంలో తరలింపు అతి క్లిష్టమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియ చరిత్రలో నిలిచిపోనుందని బైడెన్‌ పేర్కొన్నారు. 
 
ఆఫ్ఘన్‌లో చాలా కఠినమైన పరిస్థితుల్లో తమ బలగాలు పనిచేస్తున్నాయని, కాబూల్‌ విమానాశ్రయం తమ బలగాల భద్రతలో ఉందని చెప్పారు. విమానాశ్రయం వద్ద 6 వేల మంది భద్రతా సిబ్బంది ఉన్నారని, మిలటరీ విమానాలు మాత్రమే కాకుండా ఛార్టర్‌ ఫ్లైట్లు ఉన్నాయని, పౌరులను తరలించేందుకు ఈ విమానాలు ఉపయోగపడతాయని చెప్పారు. 
 
జులై నుండి ఇప్పటికే 18 వేల మందిని తరలించామని, ఆగస్టు 14 నుండి సైనిక విమానాల్లో 13 వేల మందిని తరలించామని బైడెన్‌ పేర్కొన్నారు. కాబుల్‌ నుండి అమెరికన్‌లందరినీ క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని స్పష్టం చేశారు. కాబుల్‌లో ప్రస్తుతం కనిపిస్తున్నదృశ్యాలను చూడాలని ఎవరూ అనుకోరని, మానవులెవరూ వాటిని జీర్ణించుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అక్కడి విమానాశ్రయంలో నిరీక్షిస్తున్న వారిని తీసుకొస్తామని, అయితే ఈ ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఆఫ్ఘన్‌ నుండి అమెరికా ఈనెల 31 లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. జాతీయ భద్రతాధికారుల బృందంతో బైడెన్‌ చర్చించినట్లు సమాచారం.
భారత, అమెరికా సమాలోచనలు

 
ఆఫ్ఘన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు మరోసారి చర్చించారు. ఆఫ్ఘన్‌ విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. బ్లింకెన్‌ జైశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. 
 
కాబుల్‌ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి రాగానే ఆఫ్ఘన్‌ నుండి భారతీయులను తీసుకొస్తామని, ఈ విషయమై అమెరికాతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని జైశంకర్‌ గతంలో వెల్లడించారు. ఆఫ్ఘన్‌ను విడిచి వెళ్లాలనుకునే వారికి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
 
తాలిబన్లు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతున్నారు. అక్కడి చాలామందికి చదవడం రాకపోవడంతో ధ్రువపత్రాలు ఉన్నా కొంతమందిని అడ్డుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ అన్ని పత్రాలు ఉన్నప్పటికీ అధికారుల నుండి క్లియరెన్స్‌ రావడం చాలా జాప్యమవుతోంది. 
 
దీంతో అమెరికా రాయబార కార్యాలయం ఎదుట పలువురు ఎదురుచూస్తున్నారు. గతంలో అమెరికా దళాలతో కలిసి పనిచేసినవారైతే.. తాము దేశం విడిచి వెళ్లడం ఆలస్యమైతే, తాలిబన్లు తమను లక్ష్యం చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈనెల 14 నుండి ఇప్పటివరకు తాము సుమారు 7 వేల మందిని ఆఫ్ఘన నుండి తరలించినట్లు అమెరికా రక్షణశాఖ కార్యాలయం వెల్లడించింది. కాబుల్‌లో ప్రస్తుతం 5,200 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. అక్కడి విమానాశ్రయం తమ ఆధ్వర్యంలోనే భద్రంగా ఉందని చెబుతున్నారు. 
 
రోజూ 5 వేల నుండి 9 వేల మందిని విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశామని, కానీ, ధ్రువపత్రాల పరిశీలన కొంత జాప్యమవుతోందని తెలిపారు. రాయబార సిబ్బందిని పెంచి, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అమెరికా సైనికాధికారి వెల్లడించారు. 
కాగా, బైడెన్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే అఫ్గాన్‌లోని అమెరికా రక్షణ పరికరాలను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారని సుమారు 25 మంది రిపబ్లికన్‌ సెనేటర్లు విమర్శించారు. ఇందుకు బైడెన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.