తాలిబాన్లకు ఉగ్రవాదులను సరఫరా చేస్తున్న జైష్, లష్కర్!

టైమ్స్ నౌ కు లభించిన ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారత్ లో పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపులు జైషే-ఇ-మొహమ్మద్, లష్కరే-ఇ-తైబా ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్‌లలో యుద్ధం చేయడానికి శిక్షణ కోసం తాలిబాన్‌లకు కేడర్‌ను సరఫరా చేస్తున్నట్లు వెల్లడైనది

ప్రపంచ పటంలో ఆఫ్ఘనిస్తాన్ గీసిన అస్తవ్యస్తమైన చిత్రం మధ్య ఆసియా దేశంలోని మహిళలు, పిల్లలు, పురుషులపై భయానక చిత్రాన్ని చూస్తున్న వారికి ఈ నివేదిక కలవరం కలిగిస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ, ప్రభుత్వం కీలక పాత్ర వహించినట్లు కూడా స్పష్టం అవుతుంది. 

సెప్టెంబర్ 11, 2001 నాటి ఉగ్రవాద దాడుల తరువాత అమెరికాజోక్యం చేసుకున్నప్పటి నుండి 20 సంవత్సరాల విరామం తర్వాత యుద్ధంలో దెబ్బతిన్న దేశంలో తిరిగి అధికారంలోకి రావడం కోసం తాలిబాన్లు ఆగస్టు 15 న అష్రఫ్ ఘని ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఇప్పుడు, తాలిబాన్ దేశాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్‌గా ప్రకటించడంతో, అమెరికా, నాటో దళాల ఉపసంహరణను ప్రకటించగానే, ఇంత తక్కువ వ్యవధిలో, అంత బలీయంగా తాలిబన్లు ఏ విధంగా విజృభించారని మొత్తం ప్రపంచం అచ్చెరువు చెందుతున్నది.

ఆశ్చర్యకరంగా, టైమ్స్ నౌకి చెందిన నికుంజ్ గార్గ్ కు లభించిన ఈ ఇంటెలిజెన్స్ నివేదిక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద గ్రూపులు జైష్-ఇ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-ఇ-తోయిబా (ఎల్‌ఇటి) తాలిబన్ల ఉగ్రవాద చర్యలకు శిక్షణ సమకూర్చిన్నట్లు స్పష్టం అవుతున్నది. మరోవంక, వారికి పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ ఏకే-47 వంటి ఆయుధాలను సరఫరా చేశాయి. 

నివేదిక వెల్లడించిన అంశాలు 

1. పాకిస్తాన్ జెఎమ్,  ఎల్ఇటి శిక్షణా శిబిరాలను ఆఫ్ఘనిస్తాన్‌కు మార్చింది. 

2. పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ని వ్యతిరేకించే తాలిబాన్లను తొలగించడానికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ క్యాడర్ ను  ఉపయోగించారు.

3. ఎల్‌ఇటి, జెఎమ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కింద తీవ్రవాదులను చేర్చారు.

4. పాకిస్తాన్ ఆధారిత ఐఎస్ఐ కు చెందిన వారు ఎల్‌ఇటి, జెఎమ్ నెట్‌వర్క్‌లను నడుపుతూ తాలిబాన్‌లకు సహాయం చేస్తున్నారు.

5. తాలిబాన్లకు సహాయపడటానికి శిక్షణ పొందిన క్యాడర్‌ని  పాకిస్తాన్ ఉగ్రవాద బృందాలు అందిస్తూ వచ్చాయి.

6. ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్‌లో కార్యకలాపాల కోసం లష్కర్ ఉన్నతాధికారులు హఫీజ్ సయీద్, జాకీయుర్ రెహ్మాన్ లఖ్వీ నిధులను సేకరిస్తున్నారు.

7. ఆఫ్ఘనిస్తాన్‌లో లష్కర్ ప్రమేయం దాని జిహాదీ వాక్చాతుర్యంతో ప్రతిధ్వనిస్తుంది.

ఆసక్తికరంగా, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అమెరికాతో సంభాషణలు జరపడానికి తాలిబాన్లను ఒప్పించడం ద్వారా “ఏ దేశం వారిని విస్మరించలేము” అని ప్రశంసించారు.

“ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియ కోసం పాకిస్తాన్ చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, తాలిబాన్‌లను చర్చల పక్రియలోకి  తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించినందున ఏ దేశమూ పాకిస్తాన్‌ను విస్మరించలేదు” అని అహ్మద్ పేర్కొనడం గమనార్హం. 

పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తాలిబన్లతో చర్చలు జరపడానికి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో చర్చలు జరిపినా, అందుకు తాలిబన్లే ఒప్పుకోలేదని కూడా ఆయన వెల్లడించారు. 

తాలిబన్ల అరాచకం 

మరోవంక, అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకొన్న తాలిబన్లు తమ అరాచకపర్వాన్ని మొదలెట్టారు. ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని, మహిళలపై వివక్ష చూపబోమని వాళ్లు పలికిన శాంతి ప్రవచనాలు బూటకమేనని తేలింది. అఫ్గాన్‌ స్వాతంత్య్ర దినోత్సవం రోజే తాలిబన్లు మారణహోమాన్ని సృష్టించారు. 

గురువారం దేశ స్వాతంత్య్ర దినం నేపథ్యంలో అసదాబాద్‌ నగరంలో కొందరు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. వారిపై తాలిబన్లు తూటాల వర్షం కురిపించారు. ఈ సందర్భంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు చనిపోయారు. 

‘దేశ గౌరవం కోసం జాతీయ జెండాను పట్టుకొని ర్యాలీగా వెళ్తున్న అఫ్గాన్‌ పౌరులకు సెల్యూట్‌’ అని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్‌ ట్వీట్‌ చేశారు. అంతకు ముందు, తమకు వ్యతిరేకంగా బుధవారం జలాలాబాద్‌లో నిరసనలు చేపట్టిన వారిపై తాలిబన్లు కాల్పులు జరుపడంతో ముగ్గురు మరణించారు.