కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ ఆరాటం

అమరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగించేందుకు ఆరాట పడాల్సిన కేసీఆర్‌.. తన కుర్చీని కాపాడుకోవడం కోసం, తన కొడుకుని సీఎంను చేయడానికి మాత్రమే ఆరాట పడుతున్నారని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి జి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండ గూడెం నుంచి కేంద్రమంత్రి ప్రజా ఆశీర్వాదయాత్రను  గురువారం సాయంత్రం ప్రారంభించి  కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు

ప్రజా సమస్యలపై స్పందించడానికి ప్రగతి భవన్‌ దాటి బయటకు రాని సీఎం.. ప్రధానిని విమర్శించడానికే ముందుంటున్నారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌ తన కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారని, తెలంగాణను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరంటూ దుయ్యబట్టారు.

తెలంగాణలో నిజాంను మించిన నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 2023లో జరిగే ఎన్నికల్లో షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చి ఫామ్‌హస్‌కు పరిమితం చేయాలనిక కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులను బానిసల మాదిరి చూస్తున్నారని, ఆత్మగౌరవం ఉన్న వారు ఆయన వద్ద ఉండలేరని విమర్శించారు. అందుకే ఈటల రాజేందర్‌ బయటకు వచ్చారని చెప్పారు. 

ఎన్నికలు వస్తే సీఎం కేసీఆర్‌ హామీలు ఇస్తారని, తర్వాత మరిచిపోతారని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కుట్ర చేస్తున్నారని చెప్పారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు.. రైతుల సంక్షేమం కోసం కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పేందుకు జన ఆశీర్వాద యాత్ర చేపట్టినట్లు వివరించారు.

హుజూరాబాద్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాజేందర్‌ విజయాన్ని ఆపలేరని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బంగారు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినెట్‌లో 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని చెబుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి పదవులు ఇచ్చారో కేసీఆర్‌ చెప్పాలని నిలదీశారు.

తగినంత వైద్య సిబ్బంది, మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ లేకపోయినా.. పోలీస్‌, అంగన్‌వాడీ సిబ్బంది సహకారంతో కరోనాను ఎదుర్కొన్నామని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసమే కేంద్రం రైతు చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న 80 కోట్ల మంది ప్రజలకు మనిషికి 15 కిలోల చొప్పున ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని అందజేస్తోందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న రూ.కిలో బియ్యం కోసం కేంద్రం రూ.37 ఇస్తుందని, రాష్ట్రం రూ.2 మాత్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని కేంద్ర మంత్రి తేలిపారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్లే 130 కోట్ల జనాభా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే దాదాపు 56 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయించగలిగామని తెలిపారు. 

తెలంగాణ సరిహద్దు నుంచే కేసీఆర్‌ పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారు. ఆశీర్వాద యాత్ర చేపట్టిన నాటి నుంచి కేసీఆర్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. బీజేపీలో నాయకులు, కార్యకర్తలు కలిసి కష్టపడి పనిచేస్తారని, కిషన్‌రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు కోసం హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి కృషి చేశారని తెలిపారు.