ఢిల్లీ ప్రభుత్వ బస్సుల కొనుగోలుపై సిబిఐ దర్యాప్తు 

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం బస్సుల కొనుగోలులో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ చేత దర్యాప్తునకు  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  ఆదేశించింది. 

వెయ్యి సీఎన్‌జీ లో- ఫ్లోర్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ) జరుపాలని సూచించింది. ఆప్‌ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) గత ఏడాది మార్చిలో 1,000 సీఎన్‌జీ లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు ఒక టెండర్‌ జారీ చేసింది. నాలుగు నెలల తరువాత ఈ బస్సులకు వార్షిక నిర్వహణ ఒప్పందం కోసం మరో టెండర్ జారీ చేసింది.

వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.875 కోట్లు, 12 ఏండ్ల నిర్వహణ కోసం రూ.3,500 కోట్లకు ఒప్పందం చేసుకున్నది. అయితే ఈ టెండర్‌లో అవినీతి జరిగిందని ఢిల్లీలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన సిఫార్సు చేసిన ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని రాష్ట్ర విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూలైలో డీటీసీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. బస్సుల టెండర్, కొనుగోలులో ఎలాంటి అవినీతి జరుగలేదని తెలిపింది.

అయితే నిర్ణయం తీసుకోవడంలో విధానపరమైన లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ సమర్పించిన నివేదికను కేంద్ర హోంశాఖ పరిశీలించింది. కమిటీ గుర్తించిన విధానపరమైన లోపాలపై ప్రాథమిక విచారణ జరుపాలని సీబీఐని ఆదేశించింది.ఈ వ్యవహారంలో నేరం జరిగిందా? లేదా? అనే అంశాన్ని సీబీఐ ఈ ప్రాథమిక దర్యాప్తులో తెలుసుకుంటుంది. 

ప్రస్తుతం 311 బస్సులు డీటీసీలో సేవలందిస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి మరో 89 బస్సులు రాబోతున్నట్లు తెలిసింది. ఒప్పందం ప్రకారం ఈ బస్సులను ఆరు నెలల్లోగా డీటీసీకి అందజేయవలసి ఉంది. కోవిడ్ కేసులు విపరీతంగా పెరగడంతో కంపెనీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడటంతో బస్సుల బట్వాడా ఆలస్యమైంది.