రూ.11,040 కోట్లతో జాతీయ మిషన్‌గా పామాయిల్ సేద్యం

వంటనూనె ధరల తగ్గిపుపై దృష్టి సారించిన కేంద్రం ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలు అదుపులో పెట్టడంతోపాటు.. రైతులకు చేయూతనిచ్చేలా రూ.11 వేల 40 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 
 
బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ  సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఐదేళ్లలో పామాయిల్ సేద్యాన్ని వృద్ధి చేసేందుకు రూ.11,041 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ (ఎన్ఎంఈఓ-ఓపీ)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తద్వారా వంటనూనెల దిగుమతలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా కరోనా సమయంలో వంట నూనెలు దేశీయంగా సరిపడినంతగా లేకపోవడంతో ధరలు అదుపు చేయడం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే దిగుమతుల ఖర్చులు పెరగడంతో వంటనూనెల ధరలు అదుపుచేయడం ఒకదశలో సవాల్ గా మారింది. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ఈ కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గం తాజా నిర్ణయం తీసుకుంది.
ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌ను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఎన్ఎంఈఓ-ఓపీకి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు తెలిపారు. వంటనూనెల దిగుమతిపై ఎక్కువగా ఆధారపడుతున్నందున దేశీయంగా ఆయిల్ ఉత్పత్తులను పెంచాల్సి ఉంటుందని, సాగు విస్తీర్ణం పెంచడం, ఉత్పత్తి పెంచడం ఇందులో కీలకమవుతాయని ఆయన చెప్పారు.  
సీడ్ గార్డెన్స్ కు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మూలధన పెట్టుబడులు పెరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వివరించారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఆయిల్ పామ్ పెంపకందారులకు ధర హామీని ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ప్లాంటింగ్ మెటీరియల్ కోసం హెక్టారుకు ఇచ్చే రూ.12,000 సాయాన్ని రూ.29,000కు రెట్టింపు చేస్తామని తోమర్ వెల్లడించారు.  

గరిష్టంగా 15 హెక్టార్లకు కోటి రూపాయల వరకు సహాయం అందుతుందని ఆయన తెలిపారు. కేంద్రం తాజా నిర్ణయం వల్ల దిగుమతి భారం తగ్గడంతో పాటు రైతులకు ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. 

వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్‌, అమెరికాలలో ఆయిల్‌ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు.