పడిపోయిన ఆఫ్ఘన్ కరెన్సీ, అమెరికా బ్యాంకుల్లో ఆఫ్ఘన్ నిధుల ఫ్రీజ్‌

ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఒక వంక ఆ దేశ కరెన్సీ విలువ భారీగా పడిపోవడంతో, మరోవంక తమ దేశంలోని బ్యాంకులలో ఉన్న 9.5 బిలియన్‌ డాలర్ల ఆఫ్ఘన్‌ ద్రవ్య నిల్వలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్తంభింపచేసారు. దేశ అధ్యక్షుడు, తాత్కాలిక సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ పారిపోవడంతో పెట్టుబడిదారులు కూడా ఆ దేశం నుంచి వెళ్లడానికి సిద్దం అవుతున్నారు. దీనితో తాలిబన్లు ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఆఫ్ఘన్ ఆర్ధిక వనరులు ఎక్కువగా విదేశీ బ్యాంకులలో నిల్వ ఉంటూ రావడంతో అవి తాలిబాన్లకు అందుబాటులోకి రావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఆఫ్ఘన్ కేంద్ర బ్యాంకుకు గత వారంలో రావడసిన డాలర్ల నోట్లను అమెరికా రాగాల సంక్షోభాన్ని ఉహించి నిలిపివేయడంతో ప్రస్తుతం ఆఫ్ఘన్ లో ప్రభుత్వం వద్ద డాలర్ల నిల్వలు అసలు లేని పరిస్థితి నెలకొంది. 

బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ విలువ నేడు 4.6% పడిపోయి 86.0625కు చేరుకుంది. ప్రస్తుతం “కరెన్సీ విలువ 81 నుంచి దాదాపు 100కు పెరిగి తర్వాత 86కు చేరుకున్నట్లు” తెలిపింది.

ఆఫ్ఘనిస్థాన్‌ బ్యాంకుకు చెందిన సుమారు 9.5 బిలియన్‌ డాలర్ల నిధులను తాలిబన్లు యాక్సెస్‌ చేయకుండా, ఆ దేశానికి బదిలీ కాకుండా జో బైడెన్ నిరోధించారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎల్ యెల్లెన్, ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ అధికారులు ఈ మేరకు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. 

అమెరికా బ్యాంకుల్లో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వ ద్రవ్య నిల్వలను స్తంభింపజేయాలని వారు ఆదేశించారు. ఈ చర్య ఫలితంగా, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటున్న, ‘ప్రత్యేక నియమిత జాతీయుల’ జాబితాలో ఉన్న తాలిబన్లు, యుఎస్‌లో ఉన్న ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను యాక్సెస్ చేయలేరని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. తమ బ్యాంకుల్లోని అఫ్గన్‌ ప్రభుత్వానికి చెందిన ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవని  పరిపాలనా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే తాలిబాన్‌లపై ఒత్తిడి తెచ్చేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇతర చర్యలను కూడా ఆలోచిస్తోందని చెప్పారు. ఇప్పటికే జర్మనీ డెవలప్‌మెంట్‌ నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.