కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి త‌ల‌కు గాయం

కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిష‌న్ రెడ్డి త‌ల‌కు స్వ‌ల్ప గాయ‌మైంది. విజ‌య‌వాడ‌లో ఆశీర్వాద స‌భ ముగించుకుని ఇంద్ర‌కీలాద్రిలోని దుర్గ గుడికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. కారు ఎక్కుతుండ‌గా దాని డోర్ బ‌లంగా కిష‌న్ రెడ్డి త‌ల‌కు త‌గ‌ల‌డంతో నుదుటిపై గాయ‌మైంది.  ఆయనకు వ్యక్తిగత వైద్యులు ప్రథమ చికిత్స చేసినట్టు సమాచారం.

అనంతరం ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే గాయాన్ని లెక్కచేయకుండా తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్రకు బయల్దేరారు. కోదాడ బహిరంగ సభలో సాయంత్రం కిషన్‌రెడ్డి  పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డికి  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దుర్గమ్మ ను దర్శించుకొని కిషన్‌రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం తాను వచ్చానని చెప్పారు. 

దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నిన్న తిరుమల వెంకన్న స్వామిని, ఇవాళ దుర్గమ్మను దర్శించుకున్నానని తెలిపారు. దేశ సంస్క్రతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ  అకాంక్షించారని పేర్కొన్నారు. 

తెలంగాణలోని ములుగు జిల్లాలో గల వీరబద్ర దేవాలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందని గుర్తు చేశారు. ఏపీలో 126 పురాతన కేంద్రాలున్నాయి. రానున్న రోజుల్లో వాటిని  రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. పర్యాటక శాఖ చాలా సవాళ్లతో కూడుకున్నదని చెబుతూ,  ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్అర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తామని చెప్పారు.

గత రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం దెబ్బతిందని మంత్రి తెలిపారు. జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. పర్యటక శాఖ ద్వారా తన వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి  ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాలు రెండు కళ్లలాంటివని  చెప్పారు. 

జగన్ తో కిషన్ రెడ్డి భేటీ 

అంతకు ముందు, తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్‌రెడ్డి దంపతులను సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డి సన్మానించారు. వారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహుకరించారు. 

కాగా, సీఎం జగన్ మర్యాద పూర్వకంగానే తనను ఆహ్వానించారని కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగువాడికి కేంద్ర‌మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని చెప్పారు.