చంద్రబాబుకు బుచ్చయ్య షాక్…. రాజీనామాకు సిద్ధం!

తెలుగు దేశం పార్టీలో సీనియర్లకు మర్యాద దక్కడంలేదనే అసంతృప్తితో మరో సీనియర్ నాయకుడు పార్టీని విడవడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఈ విషయం తెలియగానే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గత రాత్రి స్వయంగా ఫోనెచేసి, సముదాయించే ప్రయత్నం చేసినా ఫలించే అవకాశం లేదని తెలుస్తున్నది. రాజమండ్రికి చెందిన మాజీ మంత్రి అయినా ఆయన గతంలో ఎన్ టి రామారావు మంత్రివర్గంలో ఉన్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు చివరివరకు ఎన్టీఆర్ వెంటే బుచ్యయ్య నడిచారు. పైగా చంద్రబాబునాయుడుకు మద్దతు ఇచ్చిన శాసనసభ్యులపై పార్టీ ఫిర్యాయింపుల చట్టం వర్తింప చేయాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించి ఇరకాటంలో పడవేశారు. 
 
చివరకు చంద్రబాబునాయుడుతో చేరినా అప్పటి నుండి కీలక పదవులు ఇవ్వకుండా దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.  చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అధినేత తీరుపై అప్పట్లో బుచ్చయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చౌదరి ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని నిలిచి మరీ బుచ్చయ్య విజయం సాధించారు  పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని చాలాసార్లు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఆయన రాజీనామాకు సిద్దపడిన్నట్లు కధనాలు వెలువడగానే గతరాత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేశారు. సుమారు అరగంటకు పైగా వీరిద్దరి మధ్య పలు విషయాలు ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలిసింది.  వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని,  అన్నీ సర్దుకుంటాయని కూడా బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 
అయినప్పటికీ బుచ్చయ్య మాత్రం 24 గంటల గ్యాప్‌లోనే తాను రాజీనామా చేసేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తనను కించపర్చడమే కాకుండా తన ఇంటికి వచ్చిన వారిని కూడా దూషిస్తున్నారంటూ చంద్రబాబుకు బుచ్చయ్య చెప్పారు. పొలిట్‌బ్యూరో, వ్యవస్థాపక సభ్యుడైన తనపట్ల ఇలా ప్రవర్తించడమేంటి? అని హైకమాండ్‌తో పాటు కొందరు నేతలపై బుచ్చయ్య తీవ్ర ఆవేదనను బాబుకు చెప్పినట్లు తెలియవచ్చింది. అనుచరులతో మాట్లాడి ఈ నెల 25న రాజీనామా చేస్తానని బుచ్చయ్య ప్రకటించారు.
 
తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే ఈ విషయం తెలిసిన తర్వాతే చంద్రబాబు నుంచి బుచ్చయ్యకు ఫోన్ కాల్ వెళ్లిందని తెలియవచ్చింది. గత మూడు నాలుగు నెలలుగా ఆయన టీడీపీ కార్యక్రమాల్లో కానీ.. అధికార పార్టీ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. దానితో ఆయన ఖచ్చితంగా పార్టీ మారుతున్నట్లు స్పష్టం అవుతున్నది.