జగన్ ఆర్ధిక విచ్చలవిడితనం పట్ల ప్రధాని ఆగ్రహం!

అప్పుల మీద అప్పులు చేస్తూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల  ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే  మరో రూ 45,000 కోట్ల అప్పులకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా కేంద్రంలో ఎవ్వరు స్పందించడం లేదని చెబుతున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక  విచ్చలవిడితనాన్ని చూస్తూ వదిలేస్తే  మిగిలిన రాష్ట్రాలూ అదే బాట పడతాయని, అప్పుడు ఆర్థిక విధ్వంసం తప్పదని ప్రధాని మోదీయే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.అందుకనే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ప్రత్యేక కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ అదనపు అప్పుల కోసం ఢిల్లీలో పచార్లు చేస్తున్నా ఫలితం ఉండడం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

పైగా,  అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు బ్యాంకులు కూడా స్పందించడం లేదు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది? లక్షల కోట్ల అప్పులు చేయడమేమిటి? ఇతర రాష్ట్రాలూ ఇదే విధంగా యథేచ్ఛగా అప్పులు చేస్తే దేశం ఏమైపోతుంది! ఇలాగైతే ఆర్థికంగా కుప్పకూలిపోతాం. ఈ పరిస్థితిని సహించవద్దు’’ అని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రధాని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ మొత్తం రుణ భారం రూ.5,23,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఖాతా కింద ప్రభుత్వం అధికారికంగా చూపుతున్న అప్పు రూ.4 లక్షల కోట్లు. కార్పొరేషన్ల ముసుగులో దాచిన అప్పు రూ.1.23 లక్షల కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్ల అప్పు చేయగా… జగన్‌ ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.2.75 లక్షల కోట్లు అప్పు చేసింది.

ఏ నెలకు ఆ నెల జీతాలు, పెన్షన్ల కోసమే ప్రభుత్వం అప్పులు చేయవలసిన దుస్థితిలో పడింది. . కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను తరచూ కలుస్తూ రూ.45వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులపై ఆమె సహితం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు, వాటి కోసం చేస్తున్న ఆర్థిక అక్రమాలపై ప్రధాని ఆగ్రహంగా ఉన్నారని ఆమె చెప్పినట్లు సమాచారం.

కొత్త అప్పులు ఇప్పించడం ససేమిరా కుదరదని కేంద్రం తేల్చి చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘిస్తున్న తీరును ఆమె స్వయంగా అధికారులకు వివరించినట్లు తెలిసింది. అక్రమ పద్ధతుల్లో చేసిన పాత అప్పులకూ లెక్క చెప్పాలని, ఏపీఎ్‌సడీసీ ద్వారా తెచ్చిన రూ.21,500 కోట్ల అప్పులనూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం సూటిగా చెప్పినట్లు సమాచారం.

నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు  ‘‘ఇలాగైతే రాష్ట్రం ఆర్థికంగా రెండు నెలలకంటే ఎక్కువగా నిలబడలేదు’’ అని ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వ్యాఖ్యానించినట్లు సమాచారం.  ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు రూ.42 వేల కోట్లు రుణం తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతించింది. అయితే… అంతకుముందు మూడేళ్లు పరిమితికి మించిన అప్పు చేసిన నేపథ్యంలో అనుమతించిన అప్పు నుంచి రూ.18వేల కోట్లు కోత కోసింది. 

ఇతరత్రా ఉన్న కొన్ని వెసులుబాట్లతో కూడా కలిపి… ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలలకు రూ.20,750 కోట్లు  అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతించింది. కానీ.. రాష్ట్ర సర్కారు తొలి నాలుగు నెలల్లోనే (జూలై నెలాఖరుకు) రూ.19,750 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు చేసింది. పైగా, . ఏపీఎ్‌సడీసీ నుంచి, రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ఎడాపెడా అప్పులు తెచ్చారు. ఇంకా విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలకు విద్యార్థులు చెల్లించిన పరీక్ష ఫీజుల సొమ్ములూ లాగేశారు.