సుప్రసిద్ధ రచయిత `ఆంధ్రపత్రిక’ వీరాజీ ఇకలేరు

సుప్రసిద్ధ పాత్రికేయులు, కధకుడు, నవలా రచయిత, `ఆంధ్రపత్రిక’లో మూడు దశాబ్దాలపాటు ఎంతరో యువతరపు రచయితలను, నాయకులను ప్రోత్సహించిన వీరాజీ (81) ఇకలేరు. హైదరాబాద్ లోని తన నివాసంలో బుధవారం కన్నుమూశారు. విజయనగరంలో 1940 జులై 30 తేది జన్మించిన వీరాజీ అసలు పేరు పిళ్ళా కృష్ణమూర్తి. 
 
‘అయ్యవారికి నేను ఏకలవ్య శిష్యుడిని’’ అంటూ శివలెంక శంభుప్రసాద్ ప్రేరణతో  పత్రికారంగంలో విలక్షణమైన  గుర్తింపు పొందిన ఆయన 1961నుండి 1991లో ఆంధ్రపత్రికను మూసివేసేంతవరకు అందులోనే పనిచేశారు.  ‘ఆంధ్రవారపత్రిక’ సంపాదకులుగా ఆ పత్రికను అగ్రస్థానంలో నిలబెట్టడమే కాకుండా ఒక సంచలనం సృష్టించారు.
 
`కలువబాల’ పక్షపత్రిక సంపాదకులుగా తనదైన ముద్ర వేశారు. తెలుగు, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం గల ఆయన ఏ పక్రియ చేపట్టినా తనదైన సృజనాత్మకతను ప్రదర్శించేవారు. సినీ ప్రముఖులు, యువజన-విద్యార్థి నాయకులు ఇంటర్వ్యూలు ప్రచురిస్తూ అప్పట్లో కలకలం సృష్టించేవారు. ఆయన ఏ శీర్షిక నిర్వహించినా అదొక్క విలక్షణమైన రీతిలో సాగుతూ ఉండెడిది. 
 
సామాన్యుడి సణుగుడు, వీరాజీయం,  స్మృతిలయలు, బెజవాడ బాతాఖానీ, వార్తావ్యాఖ్య మొదలైన శీర్షికలతో ఆయన రచనలు విశేషంగా ప్రాముఖ్యత పొందాయి.  ‘కలంచిందులు’, `ముచ్చట్లు’,   ’తెరమీద – తెరవెనుక’    వంటి శీర్షికలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ‘మునగచెట్టు’ నవలకు ఎంతో ప్రాచుర్యం వచ్చింది. యూనివర్సిటీ క్యాంపస్ భూమికగా రాసిన ‘తొలి మలుపు’ విలక్షణమైన నవలగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. రష్యన్, బెంగాలీ భాషల్లోకి కూడా అనువాదమైంది.
 
క్యాంపస్ వేదికగా వచ్చిన తొలి నవలగా దానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘ఇద్దరం ఒకటే’ ఇటాలియన్ భాషలోకి అనువాదమై ఖండాంతర ఖ్యాతిని అందించింది. ‘విధి వీడని చిక్కులు’ ఆనాటి యువ రచయితలపై ఎంతో ప్రభావం చూపించింది. విజయవాడ సాహిత్య కార్యక్రమాలలో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండేవారు. మంచి వక్తగా గుర్తింపు పొందారు. 1973-75 మధ్య కాలంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొనగారు.

రష్యా ప్రభుత్వ ఆహ్వానంపై ఆ దేశంలో పర్యటించి, తన యాత్రానుభవాలను ‘యాత్రానందం’ పేరుతో ప్రచురించారు. అలాగే వివిధ పత్రికల్లో పాఠక మనోరంజకమైన పలు శీర్షికలను నిర్వహించారు.  అన్నింటిమించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకుని ఐదు దశాబ్దాల పాటు తన పాత్రికేయ జీవనం లో ఎన్నో కధలు, నవలలు, కధా సంకలనలు రచించారు.