సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్న ఎస్పీ ఎంపీ.. యోగి ఆగ్రహం!

ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్‌ నియోజకర్గ ఎంపీ షఫీక్‌ ఉర్‌ రెహ్మాన్‌ బర్ఖ్‌ (91) తాజాగా అఫ్గాన్‌ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని అన్నారు. తాలిబన్లది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పారు.

తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పారు. అయినా అదంతా అఫ్గానిస్తాన్‌ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ ఎంపీ షఫీక్‌ ఉర్‌ వ్యాఖ్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తప్పుపట్టారు.  ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు.

తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని స్పష్టం చేశారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నట్లు? అని ఆవేదన వ్యక్తం చేశారు. “మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మానవత్వానికి మచ్చ తెచ్చే వ్యక్తులకు మనం  మద్దతు ఇస్తున్నాము” అని ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబల్ నుండి లోక్ సభ ఎంపీగా ఉన్న రెహమాన్, తాలిబాన్లు వాస్తవానికి తమకు చెందిన భూమిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల్లాగే, తాలిబాన్లు కూడా తమ భూమిని విడిపించుకుని, దేశాన్ని తమకు నచ్చిన విధంగా నడపడానికి అమెరికా వంటి దేశాలకు వ్యతిరేకంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు.

“భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, మన దేశం స్వేచ్ఛ కోసం పోరాడింది. ఇప్పుడు తాలిబాన్లు తమ దేశాన్ని విడిపించుకుని నడపాలని కోరుకుంటున్నారు. తాలిబాన్ అనేది రష్యా, అమెరికా వంటి బలమైన దేశాలను కూడా తమ దేశంలో స్థిరపడనివ్వని శక్తి” అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గా పేర్కొనే తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. కావడం అందరికి తెలిసిందే. 

అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, బార్క్ వ్యాఖ్యలను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలతో పోల్చారు, అతని వ్యాఖ్యలను తాను వినలేదని అంటూ “కానీ ఈ రకమైన ప్రకటనను ఇచ్చి ఉంటె, ఆ వ్యక్తికి మరియు ఇమ్రాన్ ఖాన్‌కు తేడా ఉండదు” అని స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్ “బానిసత్వం సంకెళ్లను” తాలిబన్  విచ్ఛిన్నం చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి  ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడం తెలిసిందే. “సమాజ్ వాదీ పార్టీలో ఏదైనా జరగవచ్చు. జన గణ మన పాడలేని వ్యక్తులు ఉన్నారు, ఎవరైనా తాలిబాన్లకు మద్దతు ఇవ్వవచ్చు, మరికొందరు ఉగ్రవాదులు పట్టుబడిన తర్వాత పోలీసులపై ఆరోపణలు చేయవచ్చు. ఇది బుజ్జగింపు మాత్రమే” అని మౌర్య రాష్ట్ర అసెంబ్లీ వెలుపల ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేశారు.