పాక్ ను నమ్మం, మోదీయే కాపాడాలి… తాలిబన్ల స్పష్టం

ఆఫ్ఘానిస్తాన్ తిరిగి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం పట్ల వివిధ దేశాలలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ పౌరులు కలవరం చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో తిరిగి తాము తమ దేశం వెళ్లలేమని భారత్ లో నివాసముంటున్న ఆఫ్ఘన్లు స్పష్టం చేస్తున్నారు. పాకిస్థాన్‌, చైనా, సౌదీ అరేబియాలాంటి దేశాల‌పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని కూడా తేల్చి చెబుతున్నారు.

చిరకాలంగా ఆఫ్ఘన్ కు మిత్రదేశంగా ఉంటున్న భారత దేశమే ప్రస్తుత పరిస్థితులలో తమను కాపాడాలని కోరుతున్నారు. ఆ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నారు. ప్ర‌ముఖ న్యూస్ నెట్‌వ‌ర్క్ ఇండియా టుడే కోల్‌క‌తాలోని ఆఫ్ఘ‌న్ల‌తో దీనిపై మాట్లాడే ప్ర‌య‌త్నం చేసింది. వాళ్లంతా ముక్త‌కంఠంతో చెబుతున్న‌ది ఒక్క‌టే.. చాన్నాళ్లుగా మిత్ర‌దేశంగా ఉన్నభారత్ యే  త‌మ దేశాన్ని కాపాడాల‌ని, ఆ దిశ‌గా మోదీ ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరుతున్నారు.

ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో మోదీ త‌మ‌కు సాయం చేయ‌గ‌ల‌ర‌ని కోల్‌క‌తాలో స్థిరపడిన జ‌హీర్‌ఖాన్ అనే ఆఫ్ఘ‌న్ విశ్వాసం వ్యక్తం చేశారు.  25 ఏళ్ల కింద‌ట వీళ్లు భారత్ కు వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు. “ఈ దేశంలో దేనికైనా నేను సిద్ధం. జైల్లో వేసినా స‌రే. కానీ తాలిబ‌న్ చేతుల్లో ఉన్న ఆప్ఘ‌నిస్థాన్‌కు మాత్రం వెళ్ల‌ను” అని జ‌హీర్ స్ప‌ష్టం చేస్తున్నాడు.

కోల్‌క‌తాలోని చాలా వ‌ర‌కూ కాబూలీవాలాలు ప్ర‌స్తుతం టేల‌రింగ్ లేదా బ‌ట్ట‌ల షాపుల బిజినెస్ చేస్తున్నారు. తాలిబ‌న్ల‌కు పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌ద్ద‌తివ్వ‌డంపై ఇబ్ర‌హీం ఖాన్ అనే మ‌రో వ్య‌క్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏ ఆఫ్ఘ‌న్‌నైనా అడ‌గండి. వాళ్లు పాకిస్థాన్ నుంచి ఏమీ వ‌ద్దు అని చెబుతారు” అంటూ ధ్వజమెత్తారు. 

“మ‌మ్మ‌ల్ని బానిస‌ల‌మ‌ని ఇమ్రాన్ అంటున్నారు. నిజానికి వాళ్లే ఇత‌రుల బానిస‌లు. పాకిస్థాన్ మా నంబ‌ర్ వ‌న్ శ‌త్రువు. వాళ్ల నుంచి మాకేమీ వ‌ద్దు” అని ఇబ్ర‌హీం చెప్పాడు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తమ దేశానికి సాయం చేయాలని, అక్క‌డి వాళ్ల‌ను త‌ర‌లించ‌డానికి సాధ్య‌మైన‌న్ని ఎక్కువ విమానాల‌ను పంపించాలని కోరాడు.

ఇక ఖాన్ అబ్దుల్ గ‌ఫార్ ఖాన్ ముని మ‌న‌వ‌రాలు యాస్మిన్ నిగ‌ర్ ఖాన్ కూడా ఈ సంక్షోభంపై స్పందిస్తూ భారత్ ఓ సూప‌ర్ ప‌వ‌ర్ అని, ఆప్ఘ‌నిస్థాన్ ఈ సంక్షోభం నుంచి గ‌ట్టెక్క‌డానికి ప్ర‌భుత్వం సాయం చేయాల‌ని కోరారు. మంచి తాలిబ‌న్లు, చెడు తాలిబ‌న్లు అంటూ ఉండ‌రు. అంద‌రూ ఒక్క‌టే అని ఆమె స్పష్టం చేశారు. 

అయితే ఆఫ్ఘ‌న్ తాలిబ‌న్లు, పాక్ తాలిబ‌న్లు మాత్రం ఉన్నారని ఆమె చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లోని 90 శాతం తాలిబ‌న్లు అష్ర‌ఫ్ ఘ‌నీకి మ‌ద్దతు తెలిపారు. మిగిలిన 10 శాతం మందికీ పాకిస్థాన్ బ్రెయిన్‌వాష్ చేసి ఇలా దాడి చేయించింది అని ఆమె ఆరోపించారు. ఆఫ్ఘ‌న్ల‌కు సాయం చేయాలని ఆమె కూడా మోదీని కోరారు.

ఆఫ్ఘానిస్తాన్ లో మహిళలకు స్వాతంత్య్రం లేదని, వారు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం చాలా కష్టమని, ఇప్పుడు తాలిబన్లు రావడంతో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని నాలుగేళ్ల క్రితం ఢిల్లీ వచ్చి ఇక్కడ నివాసముంటున్న అరఫా అనే మహిళా చెప్పారు. తాము మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు చెబుతున్నా వారి మాటలను ఎవ్వరు నమ్ముతారని ఆమె ప్రశ్నించారు. బలవంతపు వివాహాలు సాధారణమని చెప్పారు.