దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు 

హుజురాబాద్‌లో ప్రారంభిస్తున్న దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఇవ్వాలని, దళిత బంధుతో పాటు గిరిజన బంధు, బీసీ బంధు పథకాలు కూడా అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం తీసుకొచ్చారని స్పష్టం చేస్తూ గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు అవని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి పథకం అటకెక్కిందని పేర్కొంటూ రైతు ఋణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల కోసం బీజేపీ చేపట్టబోయే దరఖాస్తు ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీర్ ప్రజల్లోకి వస్తాడని, రాష్ట్రంలో దళిత బంధు అందరికీ రావాలని ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నాగార్జునసాగర్, దుబ్బాక, ఎన్నికలప్పుడు పోడు భూముల గురించి మాట్లాడి ఎందుకు పరిష్కరించలేదు? అని ప్రశ్నించారు. పైగా,  గిరిజన మహిళలపై లాటి చార్జ్ చేసి నాన్బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారని, పసి పిల్లల తల్లులు బాలింతలు అని చూడకుండా జైలుకు పంపారని గుర్తు చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక, రాకముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని దరఖాస్తుల ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెబుతూ గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ఈ దరఖాస్తు ఉద్యమం  అని స్పష్టం చేశారు. దళిత బంధు పథకం లాగే ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను దరఖాస్తు రూపంలో స్వీకరించి బిజెపి తరపున ప్రభుత్వానికి ఇస్తాం. మేము ఇచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తారా లేదా అన్నది వారి ఇష్టం అని తెలిపారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాలని దరఖాస్తులు తీసుకుంటామని సంజయ్ తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆవాస్ యోజన కింద కేంద్రం ఇస్తున్న నిధులను దారి మళ్లించి డబుల్ బెడ్ రూమ్ అన్నారు. అది కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు.