నాలుగేండ్లలో రాష్ట్రమంతా దళితబంధు

రాబోయే మూడు నాలుగేండ్లలో రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు స్కీం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. వాళ్లు, వీళ్లు, ప్రభుత్వ​ ఉద్యోగులు అనే తేడా లేకుండా రైతు బంధు తరహాలోనే  ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఈ స్కీం వర్తింపజేస్తామని, రూ. 10 లక్షల చొప్పున అందజేస్తామని స్పష్టం చేశారు. 

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 17 లక్షలకు పైగా దళిత కుటుంబాలున్నాయని, స్కీం అమలుకు మహా అంటే రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు అవుతాయని, ఏడాదికి రూ. 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లు ఇచ్చినా రాబోయే మూడు నాలుగేండ్లలో దళిత వాడలన్నీ మేడలవుతాయని ఆయన​ చెప్పారు.  

హుజూరాబాద్​ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి నెల, రెండు నెలల్లో రూ. 10 లక్షల చొప్పున అందిస్తామని ప్రకటించారు. సోమవారం కరీంనగర్‍ జిల్లా హుజూరాబాద్‍ నియోజకవర్గంలోని శాలపల్లిలో దళితబంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మందికి స్కీం మంజూరు పత్రాలు, ఐడీ కార్డులు అందజేశారు.

అనంతరం కేసీఆర్​ మాట్లాడుతూ  దళితబంధు ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది ఒక మహా ఉద్యమమని,  కచ్చితంగా విజయం సాధించి తీరుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఏడాది కిందటే దీనిని అమలు చేద్దామనుకున్నామని, కరోనా వల్ల ఆలస్యం అయిందని చెప్పారు. గతంలో హుజూరాబాద్‍ కేంద్రంగా రైతుబంధు, కరీంనగర్‍లో రైతుబీమా ప్రారంభించామని, అదే సెంటిమెంట్‍తో హుజూరాబాద్‍లోనే దళితబంధు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సభలో జై దళిత బంధు..జై భీమ్‍ అంటూ కేసీఆర్​ నినాదాలు చేశారు.

దళిత బంధు అమలుకు హుజూరాబాద్‍ ఓ ప్రయోగశాల అని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక్కడ విజయవంతం- విఫలం .ఆధారంగానే మిగతా 118 నియోజకవర్గాల్లో స్కీం విజయవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని, అదే  తన ముందున్న సవాల్  అని తెలిపారు. మళ్లీ 20 రోజుల్లో తాను హుజూరాబాద్‍ వస్తానని, దళిత వాడల్లో తిరగడం ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకుందామని సీఎం చెప్పారు. స్టేట్‍ ఎస్సీ సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న రాహుల్‍ బొజ్జా కూడా దళితుడేనని, ఇక నుంచి ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శిగా ఉంటూ దళితబంధు కార్యక్రమం అమలు పర్యవేక్షిస్తూ ఉంటారని కేసీఆర్ వెల్లడించారు.