సీఎం సంగ్మా నివాసంపై పెట్రోల్ బాంబు దాడి

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులతో దాడి చేశారు. షిల్లాంగ్ నగరంలోని లైమర్ ప్రాంతంలో 3వ మైలు వద్ద ఉన్న సీఎం సంగ్మా వ్యక్తిగత నివాసంపై రెండు బాటిళ్లతో దాడి చేశారు. 

మొదటి పెట్రోల్ బాంబు సీఎం ఇంటి ముందు భాగంలో, రెండో బాంబు ఇంటి వెనుక పెరడులో పడింది.పెట్రోల్ బాంబు పడి చెలరేగిన మంటలను గార్డులు ఆర్పివేశారు.ఈ దాడి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు చెప్పారు. 

నిషేధిత ఉగ్రవాద సంస్థ హెచ్ఎన్ఎల్సీ మాజీ నాయకుడు చెస్టర్ పీల్డ్ తంగ్ కీవ్ మృతి తర్వాత మేఘాలయలో ఆదివారం పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఆగస్టు 13న జరిగిన పేలుళ్లలో తంగ్ కీవ్ ఇంటిపై దాడి చేసిన పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో కాల్చి వేశారు.

పేలుళ్లకు తంగ్ కీవ్ సూత్రధారి అని ఆధారాలున్నాయని పోలీసులు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రాన్ని కుదిపేసిన హింస,దహనం దృష్ట్యా మేఘాలయ ప్రభుత్వం షిల్లాంగ్ అగ్లోమరేషన్‌లో కర్ఫ్యూ విధించింది. ఆదివారం నాలుగు జిల్లాల్లో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

ఇలా ఉండగా, ఈ హింసకు నైతిక బాధ్యత వహిస్తూ హోమ్ మంత్రి లహకామెన్ ర్యంబి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటనపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. రాజీనామా చేస్తూ న్యాయవిచారణకు హోమ్ మంత్రి సూచించారు. తాను రాజీనామా చేయడం ద్వారా స్వేచ్ఛగా విచారణ జరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.