గుంటూరు లో నారా లోకేష్ అరెస్ట్

టిడిపి నేత నారా లోకేశ్‌ను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిన్న గుంటూరులో దారుణహత్యకు గురయిన రమ్య ఇంటి వద్ద సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేశ్‌ వెళ్లారు. అక్కడ వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి పత్తిపాడు పోలీస్‌ స్టేషను కు తరలించారు.
నారా లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ అరెస్టుపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలపై పోలీసులు దౌర్జన్యం చేస్తారా ? అని ప్రశ్నించారు. మాజీ మంత్రులను పోలీసులు ఈడ్చుకొంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
 
స్వాతంత్య్ర దినోత్సవం నాడే గుంటూరులో పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య పట్టపగలు, అందరు చూస్తుండగానే దారుణ హత్యకు గురయ్యింది. తన చెల్లిపై దాడి చేసే సమయంలో చుట్టుపక్కల వారంతా కేకలు వేయడంతో సరిపెట్టుకున్నారని, అడ్డుపడి ఉంటే తన చెల్లి బతికేదని ఆమె అక్క మౌనిక కన్నీళ్లపర్యంతమైంది. 
 
 దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టిడిపి నేతలు నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, దూళిపాళ్ల నరేంద్ర పై పోలీసుల దౌర్జ్యన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు, ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేదిగా ఉందని చంద్రబాబు  ధ్వజమెత్తారు. సీతానగరం గ్యాంగ్‌ రేప్‌ నేరస్తుడు వెంకటరెడ్డిని అరెస్టు చేయాలని కోరారు.
 
కాగా,  గతంలో వైసీపీ నాయకులు గన్ కంటే ముందు జగన్ వస్తారని చెప్పారని.. జగన్ ఎక్కడ? గన్ ఏదీ అని లోకేష్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో ఉన్న మహిళలకే సీఎం న్యాయం చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను దారుణంగా చంపేస్తే.. వాళ్లకు న్యాయం చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని ధ్వజమెత్తారు. 
 
కాగా, రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి సెల్‌ఫోన్‌ ఆధారంగా నిందితుడు వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. శశికృష్ణకు రమ్య ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైనట్టు తెలుస్తోంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో మూడు నెలలుగా గొడవపడుతున్నారు.
 
 రమ్య హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని.. పరిహారంగా రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు.