మూడు రాజధానులకు ప్రస్తుతం విరామమా!

ఏది ఏమైనా మూడు రాజధానుల ప్రతిపాదనలపై ముందుకు వెళ్లనున్నట్లు అనేకసార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆ అంశాన్ని ప్రస్తావించక పోవడం పలువురి దృష్టిని ఆకట్టుకొంది. 

రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇబ్బందులు, న్యాయపరంగా ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు రాజకీయ సమస్యలతో ప్రస్తుతం ఆ అంశాన్ని పక్కన పెట్టారా అనే అభిప్రాయం కలుగుతుంది. రోజువారీ ఖర్చులకే అప్పులు పుట్టక సతమతమవుతూ ఉండగా, రాజధాని మార్పుకు భారీ వ్యయం భరించడం కష్టం కాగలదని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. 

ఇదివరలో ఇటువంటి ప్రసంగాలతో పాటు అన్ని ప్రధాన సందర్భాలలో మూడు రాజధానుల అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావిస్తూ ఉండేవారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అమలు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారా అనే అభిప్రాయం కలుగుతున్నది. 

ప్రస్తుతం హైకోర్టులో ఈ అంశం ఉండడంతో, ఇప్పటిలో కోర్ట్ ఈ అంశాన్ని తేల్చే అవకాశాలు కనిపించక పోవడం ఒక కారణం. కోర్ట్ తీర్పుతో సంబంధం లేకుండా అనధికారికంగా ముఖ్యమంత్రి కార్యాలయంను, కొన్ని ప్రభుత్వం కార్యాలయాలను విశాఖకు మార్చాలని ప్రయత్నాలు ప్రారంభమైనా ప్రస్తుతం వాటిని ఆపివేయనున్నారని తెలుస్తున్నది. 

కర్నూల్ కు హైకోర్టు ను తరలించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడం, సుప్రీం కోర్ట్, హైకోర్టు కలసి తేల్చవలసిన  అంశం అని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ విషయమై సుప్రీం కోర్ట్ స్థాయిలో ప్రయత్నాలు చేసే అవకాశాలు కనబడటం లేదు. 

600 రోజులకు పైగా అమరావతిలోనే రాజధాని ఉండాలని రైతులు, రైతు కూలీలు ఉద్యమం ఒక వంక చేస్తుండగా, మరోవైపు ఏపీలోని తీరప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందని నాసా అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో రాజధాని మార్పుపట్ల రాజకీయంగా చెప్పుకోదగిన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపించడం లేదు. 

అక్కడ అనేక  విలువైన భూములను హస్తగతం చేసుకోవడాని అధికారపక్షంకు చెందిన ప్రముఖులు, వారి సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలు కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో రాజధాని మార్పు రాజకీయంగా ఆత్మహత్య సాదృశ్యమే అనే  అభిప్రాయంకు వచ్చారా అనే అనుమానాలు అధికార పార్టీ వర్గాలలోని కలుగుతున్నాయి.