కాబూల్‌ విమానాశ్రయంలో కాల్పుల్లో ఐదుగురు మృతి

కాబూల్‌ విమానాశ్రయంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. తాలిబన్‌లు కాబూల్‌ను కూడా ఆక్రమించుకున్నారన్న వార్తల నేపథ్యంలో.. అక్కడి ప్రజలు ఆదేశం నుండి పారిపోయేందుకు హమీద్‌ కర్జారు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
భారీగా ప్రజలు చేరుకోవడంతో విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రజల రద్దీని అదుపు చేసేందుకు విమానాశ్రయంలో కాల్పులు జరిగినట్లు సమాచారం. సోమవారం ఉదయం అమెరికా దళాలు గాల్లోకి కాల్పులు జరపడానికి యత్నించినట్లు రాయిటర్స్‌ తెలిపింది. 
 
అమెరికా వైమానిక దళానికిచెందిన పలు కార్గో విమానాలు కాబూల్‌ విమానాశ్రయంలో నిలిపి ఉంచారు. తాలిబన్ వశమైన అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో విమానాశ్రయం ఒక్కటే ఇంకా పూర్తిగా ఉగ్రవాదుల చేతిలోకి రాలేదు. దీంతో అక్కడి నుంచే తమ స్వదేశాలకు వెళ్లిపోవడానికి ఇక్కడి ప్రజలు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు ప్రజలు సునామీలా వచ్చి చేరుకున్నారు. 
 
అయితే కాబూల్ ఎయిర్‌స్పేస్ మూతపడటంతో ఇక్కడి విమాన సర్వీసులన్నీ రద్దయినట్లు తెలుస్తోంది. కాబూల్‌కు వెళ్లే విమానాలు, కాబూల్ నుంచి వచ్చే విమానాలూ ఏవీ సేవలు అందించడం కుదరదని సమాచారం.
 
 ఏ విమానం దొరికితే అందులో ఎక్క‌డానికి ఎగ‌బ‌డుతున్నారు. అయితే ఇలా లోనికి వెళ్ల‌లేక‌పోయిన వాళ్ల‌లో కొంత‌మంది విమానం టైర్ల‌ను గ‌ట్టిగా ప‌ట్టుకొని బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నించారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే.. అలా టైర్ల‌ను ప‌ట్టుకొని వేలాడుతున్న ముగ్గురు కింద ప‌డిపోయారు. వాళ్లంతా ఆ ద‌గ్గ‌ర్లోని ఇండ్ల‌పై ప‌డిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెప్పారు. వాళ్లు ప‌డ‌గానే భారీ శ‌బ్దాలు వినిపించిన‌ట్లు తెలిపారు.
 
ఎన్నికైన ప్ర‌భుత్వ నేత దేశం విడిచి పారిపోవ‌డంతో.. తాలిబ‌న్ ఫైట‌ర్లు ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్ష భవనాన్ని ఆక్రమించుకున్నారు. వీధుల్లో ఆయుధాల‌తో తాలిబ‌న్లు ప‌హారా కాస్తున్నారు. పోలీసుల వాహ‌నాల‌ను స్వాధీనం చేసుకుని తిరుగుతున్నారు. న‌గ‌ర‌మంతా గంద‌ర‌గోళంగా మారింది.
అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా..త్వరలో అఫ్ఘానిస్థాన్‌ను ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటిస్తామని కూడా పేర్కొన్నారు. తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ఆదివారం నాడు అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 
 
అయితే.. రక్తపాతాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని తాజాగా ఆయన ఓ ఫేస్‌బుక్ పోస్టులో చెప్పుకొచ్చారు. కాబూల్‌పై దాడి చేయడానికి తాలిబన్లు వచ్చారని.. ప్రతిఘటించి ఉంటే ఎంతో మంది దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని తెలిపారు. ఆయన నిర్ణయం పట్ల అఫ్ఘాన్‌ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు  పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.