తాలిబన్లతో పాక్, చైనా సయోధ్య, రష్యా కలవరం!

ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడం పట్ల మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతితో చూస్తుంటే చైనా, పాకిస్థాన్, రష్యాలు మాత్రం ఆ ఉగ్రవాద ప్రభుత్వంతో స్నేహంకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల వంటి రాక్ష‌స మూక‌ల చేతుల్లోకి వెళ్లిపోయింద‌ని ప్ర‌పంచ‌మంతా ఆందోళ‌న చెందుతుంటే,  పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ మాత్రం దీనిని బానిస సంకెళ్ల‌ను తెంచుకోవ‌డంగా అభివ‌ర్ణించారు.

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న తాలిబ‌న్ ఫైట‌ర్ల‌తో స్నేహ సంబంధాలు కొన‌సాగించేందుకు తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చైనా వెల్ల‌డించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకోవాలన్న అఫ్ఘాన్ ప్రజల హక్కును చైనా గౌరవిస్తోంది. ఆ దేశంతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా వ్యాఖ్యానించారు.  

మ‌రోవైపు ఆఫ్ఘ‌నిస్తాన్‌కు పొరుగు దేశ‌మైన ర‌ష్యా మాత్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆ దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్లు ర‌ష్యా చెప్పింది. ప్రవర్తన ఆధారంగా తాలిబన్‌ ప్రభుత్వాన్ని గుర్తిస్తామని రష్యా తెలిపింది. తాలిబన్‌ ప్రభుత్వ పని తీరును గమనించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నియమించిన ఆఫ్ఘనిస్థాన్‌ ప్రత్యేక ప్రతినిధి జమీర్ కబులోవ్ చెప్పారు. 

‘ఆఫ్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడం లేదా గుర్తించకపోవడం అనే దానిపై రష్యా తొందరపడదు. తాలిబాన్ తిరుగుబాటుదారులు నాయకత్వం వహిస్తారని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా, తాలిబన్లు బలవంతంగా ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని ఐరాసలోని మెజార్టీ సభ్య దేశాలు ఖండించాయి. తాలిబన్ల ప్రభుత్వాన్ని ఎవరూ గుర్తించకూడదని బ్రిటన్ ప్రధాని తాజాగా అభిలషించారు. ప్రజస్వామ్య దేశాలన్నీ దాదాపుగా ఇదే పంథాను ఎంచుకున్నాయి.

శ‌ర‌వేగంగా ఆఫ్ఘ‌న్ రాజ‌ధానికి వ‌శ‌ప‌రుచుకున్న తాలిబ‌న్ల దూకుడు ప‌ట్ల అమెరికా కూడా ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఊహించిన దానిక‌న్నా ముందే మిలిటెంట్లు కాబూల్‌లో పాగా వేశారు. ఏకంగా అధ్య‌క్ష భ‌వనాన్ని స్వాధీనం చేసుకున్న తీరు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను దిగ్బ్రాంతికి గురిచేసిన‌ట్లు తెలుస్తోంది. తాలిబ‌న్ల రాక‌తో దేశం విడిచిన వెళ్లిన ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ.. అర‌బ్ దేశ‌మైన ఒమ‌న్‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తున్నది.