పెగాస‌స్ ఆరోపణలు ఊహాగానాలు, నిరాధారం.. కేంద్రం స్పష్టం

పెగాస‌స్ స్పైవేర్ వ్య‌వ‌హారంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌ను ప‌రిశీలించేందుకు నిపుణుల క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని కేంద్ర ప్రభుత్వం స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానానికి నివేదించింది. ఆ మేరకు ఒక అఫిడవిట్ ను నేడు సమర్పించింది.  కోర్టు సూచించిన వ్యక్తులతో స్వతంత్ర సభ్యుల నిపుణుల కమిటీ పెగాసస్ స్పైవేర్ అంశంపై పరిశీలన చేస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
పెగాసస్‌ ఆరోపణలు ఊహాగానాలని, నిరాధారమైన మీడియా నివేదికల ఆధారంగా ఈ ఆరోపణలు వచ్చాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ తప్పుడు కథనాలను తొలగించేందుకు విచారణ కమిటీని నియమించనున్నట్లు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  కోర్టుకు సమర్పించిన రెండు పేజీల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రతిపక్షనేతలు, జర్నలిస్టులు, ఇతరులను లక్ష్యంగా చేసుకునేందుకు ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వం కోనుగోలు చేసిందన్న వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఊహాగానాలు, అసంపూర్తి, ధృవీకరించని అంశాల ఆధారంగా మీడియా నివేదికల ఆధారంగా ఈ ఆరోపణలు చేశారంటూ  ప్రభుత్వం వాటిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు డాక్యుమెంట్‌ పేర్కొంది. 
 
పిటిషనర్లు ఏ కేసును నమోదు చేయలేదని కేంద్రం పేర్కొంది. పార్లమెంట్‌లో ఐటి శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటనలను ఉటంకిస్తూ.. స్వార్థ ప్రయోజనాల కోసం వ్యాప్తి చెందుతున్న తప్పుడు కథనాల్ని తొలగించేందుకు, సమస్యను పరిశీలించేందుకు కమిటీని నియమిస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.
 
ప్ర‌ముఖ పాత్రికేయుడు ఎన్ రామ్‌తో పాటు ఎడిట‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, య‌శ్వంత్ సిన్హా త‌దిత‌రులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. పెగాస‌స్ స్పైవేర్‌తో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ నేత‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లు కోర్టు సిబ్బంది ఫోన్ల‌ను హ్యాక్ చేస్తోంద‌ని పిటిష‌న‌ర్లు ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ వ్య‌వ‌హారంపై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు చేపట్టాల‌ని పిటిష‌న‌ర్లు డిమాండ్ చేశారు. జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ‌నేత‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేసేందుకు మిల‌ట‌రీ గ్రేడ్ స్పైవేర్‌ను వాడుతున్న‌ట్టు పిటిష‌న‌ర్లు చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. వార్తా ప‌త్రికల క‌థ‌నాల ఆధారంగా ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు ధాఖ‌లు చేయ‌లేర‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స్పష్టం చేశారు.

పెగాసస్ స్పై వేర్ ఉపయోగించారా లేదా అన్న అంశం పై కేంద్రం తన అపిడవిట్‌లో స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ల తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పెగాసస్ ఉపయోగించలేదని కేంద్రం చెప్తే పిటిషనర్లు తమ పిటిషన్స్ ఉపసంహరించుకుంటారా? అని పిటిషనర్లను సోలిసిటరీ జనరల్ ప్రశ్నించారు.

కేంద్రం చట్టం ప్రకారం వ్యవహరిస్తుందని పార్లమెంట్‌కు సమాధానం ఇచ్చిందని, నిపుణుల కమిటీ ద్వారా వాస్తవాలు బయటపెట్టడానికి ప్రయత్నిస్తుందని సొలిసిటరీ జనరల్ తెలిపారు. కమిటీ ఏ అంశంపై దర్యాప్తు చేయాలో కోర్టే నిర్ణయించాలని సొలిసిటరీ జనరల్ కోరారు.

పెగాస‌స్ స్పైవేర్ ద్వారా భార‌త్‌లో ఇద్ద‌రు మంత్రులు, 40 మందికి పైగా జ‌ర్న‌లిస్టులు, ముగ్గురు విప‌క్ష నేత‌లు, ఓ సిట్టింగ్ న్యాయ‌మూర్తి స‌హా ప‌లువురు వ్యాపార‌వేత్త‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌ల‌తో కూడిన 300 మందికి పైగా వ్య‌క్తుల ఫోన్ల‌ను హ్యాకింగ్ కోసం టార్గెట్ చేశార‌ని అంత‌ర్జాతీయ మీడియా క‌న్సార్షియం ఇటీవ‌ల వెలుగులోకి తేవ‌డం భారత్ లో క‌ల‌కలం రేపింది.