అష్రఫ్‌ ఘనీ పలయానం… కాబూల్ లో తాలిబన్ల పాగా  

రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో మళ్లీ పట్టు సాధించారు. నెల రోజుల్లోనే ప్రభుత్వ బలగాలను ఓడించి యావత్‌ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం రాజధాని కాబూల్‌ శివారుల్లోకి ప్రవేశించిన తాలిబన్లు సాయంత్రానికల్లా నగరంలో పాగా వేశారు. 

దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ.. కుటుంబసభ్యులతో సహా తజికిస్థాన్‌ వెళ్లిపోయినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఆయ‌న త‌న కోర్ టీమ్‌తో క‌లిసి ఆఫ్ఘ‌నిస్థాన్‌ను వీడిన‌ట్లు తెలిసింది. మరోవైపు, ప్రభుత్వం లొంగిపోవాలని తాలిబన్లు అల్టిమేటం ఇచ్చారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అధ్యక్ష భవనం నుంచే ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాబూల్‌ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ప్రజలు భయభ్రాంతులు కావద్దని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడి జరుగుతుందని వెల్లడించారు.

ఆప్ఘన్ పరిణామాలతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల రాయబారులు, సిబ్బందిని తరలించే ప్రక్రియను వేగవంతం చేశాయి. అమెరికా, ఇయు, భారత్ తదితర దేశాలు సిబ్బందిని క్షేమంగా తమతమ దేశాలకు ప్రత్యేక విమానాల్లో క్షేమంగా సొంత దేశాలకు చేర్చుకుంటున్నాయి.

129మందితో ఆదివారంనాడు సాయంత్రం కాబూల్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం గంటల్లో ఢిల్లీలోని అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది. సోమవారంనాడు మరో దఫా విమానం కాబూల్ వెళ్లి అక్కడ ఉన్న భారతీయులను తరలించే ప్రక్రియను కొనసాగిస్తుందని అధికార వర్గాలు ప్రకటించాయి. 

కాబూల్‌ తాలిబన్ల వశం కావడంతో అమెరికా తమ దౌత్య సిబ్బందిని తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. బోయింగ్‌ సీహెచ్‌-47 చినూక్‌, సికోర్‌స్కై యూహెచ్‌-60 హెలికాప్టర్లు కాబూల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపైకి చేరుకొన్నాయి. ఆ తర్వాత కొద్ది సమయానికే ఆ కార్యాలయం మీద నల్లటి దట్టమైన పొగ కనిపించింది. 

రక్షణపరమైన కీలక పత్రాలు తాలిబన్లకు దొరక్కూడదనే ఉద్దేశంతోనే అమెరికా అధికారులు వాటిని దహనం చేసినట్టు సమాచారం. మరోవైపు, ఖాతాల్లోని సొమ్ము తీసుకొనేందుకు కాబూల్‌ ప్రజలు పెద్దయెత్తున బ్యాంకుల ఎదుట బారులు తీరారు. కాబూల్‌లోని భారత పౌరులు, దౌత్యవేత్తలను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

చేతి వేళ్లకు నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటే వేళ్ల నరికివేత, పురుషులతో కలిసి పనిచేస్తే చచ్చేవరకు రాళ్లతో కొట్టడం, బిగుతైన దుస్తులు ధరిస్తే రాడ్లతో నెత్తుటేర్లు పారించడం.. ఇవే 1998-2001 మధ్య కాలంలో ఆఫ్ఘన్‌ను ఆక్రమించిన తాలిబన్ల రాజ్యంలో మహిళలపై జరిగిన అరాచకాలు. తాజాగా మళ్లీ ఆఫ్ఘన్‌ తాలిబన్ల చెరలోకి వెళ్లడంతో అక్కడి మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.