తాలిబన్ల ఆధీనంలో తిరిగి ఆఫ్ఘానిస్తాన్

ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల ఆధీనంలోకి వచ్చింది. ప‌ది రోజులుగా దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను ఆక్రమిస్తూ వ‌స్తున్న ఈ తిరుగుబాటు దారులు ఆదివారం రాజ‌ధాని కాబూల్‌లోకి కూడా వ‌చ్చారు. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది. తాలిబ‌న్ల‌కు శాంతియుతంగా అధికార బ‌దిలీ చేస్తామ‌ని అక్క‌డి మంత్రి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే తాలిబ‌న్ల త‌ర‌ఫున మ‌ధ్య‌వ‌ర్తులు చ‌ర్చ‌ల కోసం అధ్య‌క్ష భ‌వనానికి రావడంతో అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ అధికార పీఠం నుంచి పోవడం,  నూతన తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా అలీ అహ్మద్ జలాలీని నియమించడం జరిగిపోయింది. 

ఆయన గతంలో ఆఫ్ఘన్ తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తర్వాత జర్మనీకి దేశ రాయబారిగా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంప్రదింపులతో దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికా వంటి దేశాలు తమ ప్రభుత్వంకు గుర్తింపు ఇచ్చేటట్లు చేసుకున్న తర్వాత, క్రమంగా తాలిబన్ నేతలు నేరుగా అధికారం చేపట్టే అవకాశాలున్నాయి. 

తాము `శాంతియుత అధికార మార్పిడి’ కోసం ప్రయత్నం చేస్తున్నామని, బలప్రయోగం చేయబోమని తాలిబన్లు ప్రకటించారు. కాబుల్ లో బలవంతంగా జరిగే అధికార మార్పిడిని తాము గుర్తింపబోమని అంటూ అమెరికాతో సహా ప్రపంచ దేశాలు స్పష్టం చేయడంతో శాంతియుతంగానే తాము అధికారం చేపట్టిన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నట్లుంది. 

అంతకుముందు తాలిబన్లు ఓ ప్రకటనలో సాధారణ ప్రజలు భయపడవలసిన అవసరం లేదని కాబుల్ ప్రజలకు భరోసా  ఇచ్చారు. తాము కాబూల్‌లోకి సైనికపరంగా ప్రవేశించబోమని, తాము శాంతియుతంగానే కాబూల్ వైపు వస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవంక, ప్రభుత్వ దళాల నుంచి ఎటువంటి నిరోధం లేకుండానే కాబూల్‌లోకి తాలిబన్లు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

తాలిబన్ అగ్ర నేతలు తమ ఉగ్రవాదులకు ఇచ్చిన సమాచారంలో, కాబూల్ గేట్ల వద్దనే వేచి ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. వాళ్లు న‌గ‌రంలోకి అన్ని వైపుల నుంచీ వ‌స్తున్న‌ట్లు ఆఫ్ఘ‌న్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కాబూల్‌లో ఎలాంటి హింస‌కు పాల్ప‌డొద్ద‌ని తిరుబాటుదారుల నాయ‌క‌త్వం ఇప్ప‌టికే త‌మ వారికి సూచించింది. కాబూల్‌ను వీడి వెళ్లిపోయే వారికి ఎలాంటి అడ్డంకులు క‌ల్పించ‌వ‌ద్ద‌నీ స్ప‌ష్టంచేసింది.

అంతకు ముందు, బగ్రామ్ వైమానిక స్థావరం సమీపంలో ఉన్న సైనిక జైలును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ జైలులోని ఖైదీలను విడుదల చేశారు. ఈ ఖైదీల్లో అత్యధికులు తాలిబన్ ఉగ్రవాదులే.  బగ్రామ్ ఎయిర్ బేస్‌ను ఆఫ్ఘనిస్థాన్‌లో అతి పెద్ద అమెరికన్ మిలిటరీ స్థావరంగా వినియోగించారు.

ఇప్పుడు ఇది తాలిబన్ల నియంత్రణలోకి వచ్చింది. ఈ జైలు కూడా అమెరికన్ దళాల నియంత్రణలోనే ఉండేది. జూలై ఒకటిన దీనిని ఆఫ్ఘన్ దళాలకు అప్పగించారు. అప్పటికి ఈ జైలులో దాదాపు 5 వేల మంది ఖైదీలు ఉండేవారు.

కీలక పత్రాలు ధ్వసం చేసిన అమెరికా 

కాబూల్‌లోకి తాలిబన్లు ప్రవేశించడంతో అక్కడి అమెరికా రాయబార కార్యాలయం అధికారులు కీలక పత్రాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. అత్యవసర విధ్వంస సేవల్లో భాగంగా సున్నితమైన పత్రాలు, ఫైల్స్‌, వస్తువులు, ఇతర సమాచారాన్ని నాశనం చేయాలన్న అమెరికా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని ధ్వంసం చేశారు.

తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో దుర్వినియోగమయ్యేందుకు వీలున్న ఎంబసీ లోగోలు, అమెరికా జెండాలతోపాటు ఇతర ముఖ్య వస్తువులను అధికారులు నాశనం చేశారు. అమెరికా త‌న ఎంబ‌సీలోని వారిని హెలికాప్ట‌ర్ల‌లో సుర‌క్షితంగా అక్క‌డి నుంచి త‌ర‌లిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఆఫ్ఘన్‌పై వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలి

ఆఫ్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి జరగబోతున్నట్లు సమాచారం వస్తుండటంతో ఆ దేశం పట్ల మన దేశ వైఖరిని వెంటనే పునఃసమీక్షించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్ రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. 

కాబూల్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోబోతుండటంతో, ఈ పరిణామాలను మనం నిరోధించలేకపోయినా, వాటి వల్ల మన ప్రయోజనాలపై కలిగే ప్రతికూల ప్రభావాన్ని నిరోధించడానికి సిద్ధమవాలని సూచించారు. తాలిబన్లు శాంతి గురించి మాట్లాడటం సరికొత్త మార్పు అని ఎద్దేవా చేశారు. నగరంలో ఎటువంటి హింసకు పాల్పడరాదని ఫైటర్స్‌కు ఆదేశాలు జారీ అయినట్లు తెలిపారని చెప్పారు.