ఇంకా గడీ కబంధ హస్తాల్లోనే తెలంగాణ 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు పూర్తైనప్పటికీ రాష్ట్రం ఇంకా గడీ కబంధ హస్తాల్లోనే ఉందని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. నాటి నిజాం కర్కశ పాలన, గడీల కబంధ హస్తాలు, మధ్యలో బ్రిటిష్ వారి అరాచకాలు… నేడు మరింత తీవ్రరూపం దాల్చాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. 

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఆమె స్పందిస్తూ భారతదేశపు 75వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేళ్ళయినా ఇక్కడ మాత్రం ప్రజలు బానిసల్లాగే బతుకు గడుపుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు.

ఏ పరిస్థితుల నుంచి బయటపడాలని రాష్ట్రం సాధించుకున్నామో, ఆ పరిస్థితులు నేడు మరింత తీవ్రరూపం దాల్చాయే తప్ప కాస్తయినా మెరుగుదల లేదని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా ఉందో ఆ దేవుడికే ఎరుక. నదీ జలాల్లో తెలంగాణ వాటా నీటిని రక్షించుకోలేని దుస్థితిలో రాష్ట్ర సర్కారు ఉందని ఆమె పేర్కొన్నారు.

ఉద్యోగాల విషయానికొస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ప్రభుత్వ కొలువులు ఖాళీగా ఉన్నా పూర్తిస్థాయిలో భర్తీ చెయ్యరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు. ఉద్యోగాల్లో ఉన్నవారికి, పింఛన్‌దార్లకు జీతాలు, పింఛన్లు ఎప్పుడు పడతాయో తెలీదు. ఇక అన్నదాతల పరిస్థితి సరేసరి. మద్దతు ధరలేదు, తగినన్ని కొనుగోలు కేంద్రాలుండవని ఆమె వివరించారు.

రాష్ట్రంలో ఏ వర్గానికైనా… ఏ కాస్తయినా కనీసం కొద్దిరోజుల పాటు మేలు జరగాలంటే అక్కడ ఏదో ఒక ఎన్నికో, ఉపఎన్నికో ఉండాల్సిందేనని అందరికీ బాగా అర్థమైందని ఆమె ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణలో మహిళలకు దక్కే గౌరవం ఏమిటో నిన్నగాక మొన్న ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పోడు భూముల వ్యవహారంలో అరెస్టయిన పసిపిల్లల తల్లుల్ని అడిగితే చెబుతారని ఆమె చెప్పారు.

వృద్ధుల సంగతి చూస్తే…. దేశంలో ముసలివారు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కాగా, వృద్ధుల సంక్షేమంలో తెలంగాణ 10వ స్థానంతో అట్టడుగున నిలిచింది. ఇలా ఏ రంగం చూసినా అథోగతే తప్ప పురోగమనం లేని పరిస్థితి. ఈ తెలంగాణ సర్కారు నుంచి కాపాడుకోవడానికి ప్రజలు మరో స్వాతంత్రయోద్యమానికి నడుం బిగించాల్సిన పరిణామాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయని విజయశాంతి స్పష్టం చేశారు.