జమ్మూ, కాశ్మీర్ లో తొలిసారి సర్వత్రా జాతీయ జెండాలు

తొలిసారిగా కేంద్ర పాలిత ప్రాంతంలోని అన్ని భవనాలు, పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జెండా వందనం తర్వాత కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిచారు. పంచాయతీ సభ్యులు తమ నియోజకవర్గాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో అన్నిశాఖల్లోనూ జాతీయ జెండాలను ఆవిష్కరించాలని జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహించారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి 100 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న హరి ప్రభాత్ కొండపై ఈ జెండాను ఏర్పాటుచేశారు. ఈ జెండాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆవిష్కరించారు. ఈ జెండా పొడవు 36 అడుగులు, వెడల్పు 24 అడుగులు. 

శ్రీనగర్ లోని గల్లీగల్లీలో జెండాలు ఎగురవేశారు. ముఖ్యంగా దాల్ సరస్సు ప్రాంతం జెండాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లోని క్లాక్ టవర్‌ను త్రివర్ణ పతాకం రంగులతో తీర్చిదిద్దారు.

ఆదివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హరి పర్వతం కోట ప్రాకారాలపై ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తైన స్తంభంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జాతీయ జెండాను ఆవిష్కరించారు. డౌన్ టౌన్‌లో ఉన్న హరి పర్వతం… అద్భుతమైన చరిత్ర, నాగరికత, సంస్కృతిని కలిగి ఉన్నది. ఇది కశ్మీర్ హిందూ సంస్కృతి, భారతీయతకు చిహ్నంగా కూడా చెప్పుకుంటారు. 

హరి పర్వతంపై ఉన్న కోటను కో-ఈ-మారన్ కోట అని కూడా పిలుస్తుంటారు. దీనిని 1808 లో ఆఫ్ఘన్ గవర్నర్ అతా మహ్మద్ ఖాన్ నిర్మించారు. అంతకుముందు, ఈ ప్రాంతంలో మొఘల్ పాలకుడు అక్బర్ 1509 లో సైనిక కంటోన్మెంట్ నిర్మించాడు. మొఘల్ సైనికులు ఎక్కువగా వారి కంటోన్మెంట్‌లో నివసించేవారు. 

కశ్మీర్‌లో ఇస్లామిక్ ఆక్రమణదారుల పాలన, ఇస్లాం ప్రభావం పెరుగడంతో హరి పర్వతం పేరును కో-ఈ-మారన్ గా మార్చినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌ను త్రివర్ణ రంగులతో అలంకరించారు.

కాగా, జమ్మూ-కశ్మీరులో 2016లో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వనీ తండ్రి ముజఫర్ వనీ ఆదివారం జాతీయ జెండాను ఎగురవేశారు. వృత్తి రీత్యా టీచర్ అయిన ముజఫర్ పుల్వామా జిల్లా, ట్రాల్‌లోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వనీ భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2016 జూలైలో మరణించాడు. దీంతో కశ్మీరులో ఐదు నెలలపాటు జరిగిన ఆందోళనల్లో దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. 

ఆర్టికల్ 370 రద్దుకు ముందు జెండా ఆవిష్కరణ కేవలం జిల్లా కేంద్రంలో, కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే జరిగేది. అయితే, ఈసారి స్వాతంత్య్ర దినోత్సవానికి చాలా ముందుగానే జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి ఆమేరకు ఏర్పాట్లు పూర్తిచేయడంతో అంగరంగ వైభవంగా సంబురాలు జరిగాయి.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్, మొబైల్ సేవలు ప్రభావితం కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.