న‌క్స‌ల్స్ ప్రాంతంలో తొలిసారి ఎగిరిన జాతీయ జెండా

ఒడిశాలోని న‌క్స‌ల్స్ ప్ర‌భావిత ప్రాంతంలో భార‌త‌ భ‌ద్ర‌తా స‌రిహ‌ద్దు ద‌ళాలు  పంద్రాగ‌స్టు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. 75వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఒడిశా – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దులోని ద‌ట్ట‌మైన అడవుల్లో బీఎస్ఎఫ్ ద‌ళాలు తొలిసారి త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశాయి.

స్థానికంగా ఉన్న మొహుప‌దార్ ఏరియా మావోయిస్టుల‌కు అడ్డ‌. ఈ ప్రాంతంలో మావోయిస్టులు పోలీసు బ‌ల‌గాల‌పై ఎన్నోసార్లు దాడుల‌కు పాల్ప‌డ్డారు. పాఠ‌శాల, పంచాయ‌తీ భ‌వ‌నాల‌తో పాటు పోలీసు స్టేష‌న్‌ను కొన్నేండ్ల క్రితం మావోయిస్టులు ధ్వంసం చేశారు. 

ఈ క్ర‌మంలో అక్క‌డ పూర్తిగా అభివృద్ధి కుంటు ప‌డిపోయింది. స్థానిక గ్రామాల ప్ర‌జ‌ల‌కు బ‌య‌టి ప్ర‌పంచం తెలియ‌కుండా మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ నేప‌థ్యంలో 160వ బీఎస్ఎఫ్ బెటాలియ‌న్ ద‌ళాలు.. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని ఈ ఏడాది మే 28న‌ బేస్ క్యాంపును ఏర్పాటు చేశాయి.

అనంత‌రం ఆ ఏరియాను భ‌ద్ర‌తా ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. లింకు రోడ్ల‌ను నిర్మించారు. ఇక అక్క‌డ అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టి.. స్థానికుల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

మొత్తంగా ఆదివారం జ‌రిగిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో మ‌ల్క‌న్‌గిరి బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌కే సింగ్, 160వ బెటాలియ‌న్ క‌మాండెంట్ తీర్థ ఆచార్య‌తో పాటు మొహుప‌దార్ గ్రామ స‌ర్పంచ్ పాల్గొన్నారు.