పాక్, చైనా సరిహద్దుల్లో డేగ కన్నుల్లాంటి కెమెరాలు

గత కొన్నాళ్లుగా సరిహద్దుల్లో చొరబాట్లు పెరుగుతుండటంతో కఠిన చర్యలకు భారత సైన్యం ఉపక్రమించింది. డ్రోన్ల సాయంతో ఆయుధాలు, మందు గుండు సరఫరా జరుగుతుండటాన్ని నిరోధించేందుకు మరింత జాగురూకతతో ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో డేగ కన్నుల్లాంటి అధునాతన కెమెరాలను వినియోగించేందుకు సిద్ధమైంది.
ఈ కెమెరాల సాయంతో సరిహద్దుల ద్వారా చొరబాట్లను, డ్రోన్ల ద్వారా ఆయుధాల చేరవేతను అరికట్టడంతోపాటు తమ సైనికుల కదలికలను కూడా పర్యవేక్షించేందుకు వీలుండనున్నది. వేలాది కిలోమీటర్లు విస్తరించి ఉన్న భారత సరిహద్దులో పాకిస్తాన్, చైనాలతో నిరంతర వివాదం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో భారత సైన్యం సరిహద్దులో మరింత నిఘా పెంచాలని నిర్ణయించింది. 
సరిహద్దులను రక్షించడానికి సాంకేతిక ఆధారిత నిఘా వినియోగం గత కొన్నేండ్లుగా పెరిగింది. ఇందు కోసం అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలపై భారతదేశం ఆధారపడవలసి ఉండేది. అయితే, ఇప్పుడు మనం ఈ విషయంలో అభివృద్ధి సాధించాం. దేశంలోని పలు కంపెనీలు డిఫెన్స్ నుంచి ఆర్డర్లు పొందుతున్నాయి. ఇందులో భాగంగా చైనాతో సరిహద్దును పర్యవేక్షించేందుకు సరిహద్దులో ప్రత్యేక నిఘా కెమెరాలను భారత సైన్యం ఏర్పాటు చేస్తున్నది.
అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న స్టార్టప్ సంస్థ.. ఆప్టిమైజ్డ్ ఎలక్ట్రోటెక్ రూపొందించిన అత్యాధునిక కెమెరాలు ఇప్పుడు చైనా, పాకిస్తాన్ సరిహద్దుపై నిఘాలో భాగం కానున్నాయి. ఈ అత్యాధునిక కెమెరాలు 30 కి.మీ వ్యాసార్థంలో ఏదైనా వాహనం, 18 కి.మీ వ్యాసార్థంలో ఉన్న ఏ వ్యక్తి కదలికలనైనా గుర్తిస్తుంది. ఎదురుగా ఉన్న వాహనం మిలిటరీ లేదా సాధారణమైనదా? అనే విషయాన్ని 20 కి.మీ దూరం నుంచే ఈ కెమెరా గుర్తుపట్టేస్తుంది.
ఎదురుగా వస్తున్న వాహనంలో ఆయుధాలు ఉన్నాయా లేదా ఆ వాహనంలో సాధారణ ప్రజలు ఉన్నారా? అనే విషయాలను కూడా తెలియజేస్తుంది. 13 కి.మీ ల పరిధిలోని వ్యక్తి వద్ద ఆయుధాలు ఉన్నాయా? లేవా? అనేది గుర్తించి సమాచారం చేరవేస్తుంది. సరిహద్దుకు వచ్చిన వ్యక్తి ఎవరు? సైనికుడా లేక పౌరుడా? అని.. అనుమానితుడిని గుర్తించి హెచ్చరికలను పంపడంలో ఈ కెమెరా సాయపడుతుంది.  ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ద్వారా సరిహద్దు ప్రాంతంలో కదలికను కెమెరాలో బంధించి హై డెఫినిషన్ ఇమేజ్ కంట్రోల్ రూంకు పంపుతుంది. ఈ కెమెరా 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ ఫొటోలు తీస్తుంది.

ట్రయల్స్ నిమిత్తం తొలుత ఈ కెమెరాలను చైనా సరిహద్దులో ఇన్‌స్టాల్ చేసినట్లు ఆప్టిమైజ్ ఎలక్ట్రోటెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ షా తెలిపారు. సరిహద్దులో విభిన్న వాతావరణంలో ఈ కెమెరా ఎలా పని చేస్తుందనే విషయాలను ట్రయల్స్‌లో గమనించవచ్చునని చెప్పారు. ఈ కెమెరా సరిహద్దుల నుంచి చొరబాటుతో పాటు పొరుగు దేశాల సరిహద్దుల్లో దళాల కదలికపై కూడా నిఘా ఉంచేందుకు సాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.