ఆర్టీఇ పరిధిలో లేని క్రైస్తవ విద్యాసంస్థలు రూ 2,500 కోట్లు ఆదా

దేశవ్యాప్తంగా దాదాపు 13 వేల క్రైస్తవ పాఠశాలలు విద్యా హక్కు చట్టం పరిధిలోకి రాకపోవడంతో ప్రతి ఎలా రూ 2,500 కోట్ల మేరకు ఆదా చేయగలుగుతున్నాయని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) నివేదిక వెల్లడించింది.    

అన్ని అన్-ఎయిడెడ్  పాఠశాలలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో ప్రవేశం కల్పించాలని విద్యా హక్కు చట్టం చెప్తోంది. దీని పరిధిలోకి మైనారిటీ విద్యాసంస్థలను తీసుకురావాలని ఎన్‌సీపీసీఆర్ కేంద్ర ప్రభుత్వనాయికి సిఫార్సు చేసింది. మైనారిటీ పాఠశాలలపై  ఎన్‌సీపీసీఆర్ అధ్యయనంలో చాలా ముఖ్యమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

2017-18లో ప్రైవేటు అన్-ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సాధారణ కోర్సులు అభ్యసించేందుకు ఒక్కొక్క విద్యార్థి చేసిన ఖర్చు రూ.18,267 అని ఈ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 13 వేల క్రైస్తవ మైనారిటీ స్కూళ్ళు ఉన్నాయని, వీటిలో 54,86,884 మంది చదువుతున్నారని, ఈ విద్యార్థుల నుంచి సంవత్సరానికి రూ.10,022.89 కోట్లు వసూలు చేస్తున్నాయని వెల్లడైంది.

విద్యా హక్కు చట్టం పరిధిలోకి మైనారిటీ విద్యా సంస్థలు రాకపోవడం వల్ల సమాజంలో అణగారిన, బలహీన వర్గాలవారి పిల్లలకు ప్రవేశం కల్పించడం నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఫలితంగా క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలలు దాదాపు రూ.2,505.72 కోట్ల మేరకు ఆదా చేసుకుంటున్నాయి.  క్రైస్తవ పాఠశాలల్లో చదివేవారిలో 74.01 శాతం మంది క్రైస్తవులు కాదు. కొన్ని రాష్ట్రాలలో వీరి సంఖ్య 80 శాతం వరకు ఉంది. ఎన్‌సీపీసీఆర్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టాలను సవరించవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు క్రైస్తవ సంస్థల ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ప్రవేశం కల్పించేందుకు వీలుగా మార్పులు చేయాలని ఆమె సూచించారు. మైనారిటీ స్కూల్స్‌గా చెప్పుకుంటూ, ప్రధానంగా నాన్ క్రిస్టియన్ కేటగిరీల్లోని ఉన్నత వర్గాలవారి పిల్లలను చేర్చుకుంటున్నాయని ఆమె పేర్కొన్నారు.