ఆఫ్ఘన్ లో భారతీయుల రక్షణకై 20 వేలమంది సైనికులను పంపండి 

ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగుతున్న తాలిబాన్ దాడులతో భద్రతా పరిస్థితి క్షీణిస్తున్నందున, బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యం స్వామి ఘర్షణలతో చిక్కుకున్న భారతీయులతో పాటు మతపరమైన మైనారిటీల రక్షణకు 20,000 మంది సైనికులను పంపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బిజెపి ఎంపీ డా. సుబ్రమణియన్ స్వామి పిలుపిచ్చారు.

“మనం ఆఫ్ఘన్ ప్రభుత్వానికి సహాయం చేయాలి. కాబూల్‌ను రక్షించడానికి 20,000 మంది సైనికులను పంపాలి. అక్కడ హిందువులు,  సిక్కులకు ఆశ్రయం ఇవ్వాలి” అంటూ ఒక ట్వీట్ చేశారు.  తాలిబాన్ల దాడి నేపథ్యంలో భారత వైమానిక దళం దేశానికి ‘బలమైన మద్దతు’ అందించాలని ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరినట్లు మీడియా నివేదికకు ప్రతిస్పందనగా స్వామి ఈ ట్వీట్ చేశారు.

గత ఏడాది ఆగస్టులో, కాబూల్‌లో పేలుళ్ల తరువాత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అత్యవసర చర్చను సులభతరం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆగస్టులో భారతదేశం చైర్‌పర్సన్ స్థానాన్ని నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన అభ్యర్ధనను ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం “సంబంధితంగా మారడానికి చివరి అవకాశం” గా అని స్వామి అభివర్ణించారు.

వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేయక ముందే భారతదేశానికి తిరిగి రావడానికి తక్షణ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని ఆఫ్ఘనిస్తాన్‌లో “సందర్శించడం, ఉండడం,  పని చేయడం” కోసం భారత పౌరులందరికీ భారత ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని భారతీయ కంపెనీలన్నీ ప్రాజెక్ట్ సైట్ల నుండి భారతీయ ఉద్యోగులను వెంటనే ఉపసంహరించుకోవాలని సలహా ఇచ్చింది.

అమెరికా తన ఆయుధాల గిడ్డంగిని భారతదేశానికి అప్పగిస్తే, అమెరికాకు సహాయం చేయడానికి మన ప్రభుత్వం సైనికులను ఆఫ్ఘనిస్తాన్‌కు పంపాలని స్వామి ఇదివరకే సూచించారు.  9/11 తర్వాత అమెరికా ప్రకటించిన “ఉగ్రవాదంపై యుద్ధం లో పాల్గొనడానికి తన సైన్యాన్ని యుద్ధంతో దెబ్బతిన్న దేశానికి భారత్ పంపే అవకాశం లేకపోయినా ఆయన సూచన ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.

ఆఫ్ఘానిస్తాన్ లో మకాం వేసిన ఉగ్రవాదులు రేపెప్పుడైనా భారత్ లో ప్రవేశించే అవకాశం ఉన్నందున, వారిని అక్కడనే కట్టడి చేయడం చాల అవసరమని ఆయన స్పష్టం చేశారు.