ఓబీసీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ఓబీసీ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఓబీసీ జాబితాను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు కల్పిస్తూ రాజ్యసభలో కేంద్రం బుధవారంనాడు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు. దీనికి ఒకరోజు ముందు మంగళవారంనాడు ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది.

385 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయలేదు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 187 మంది సభ్యులు ఓటేశారు. వ్యతిరేకంగా ఎవరూ ఓటేయలేదు. ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష సభ్యులు చేసిన కొన్ని సవరణలను సభ తోసిపుచ్చింది.

సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ జాబితాలను తయారు చేసుకునే అధికారాలను పునరుద్ధరించేదుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని ఆయన సభకు తెలిపారు. పెగాసస్, సాగు చట్టాలపై చర్చించాలంటూ పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాల ఆందోళనలు కొనసాగిస్తున్న నేపధ్యంలో ఈ బిల్లుపై సుమారు 5 గంటల పాటు చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులతో పాటు విపక్ష నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.

రాజ్యాంగంలోని 368వ అధికరణ ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలంటే ప్రత్యేక మెజారిటీ అవసరం ఉంటుంది. సభలో హాజరై, ఓటింగ్‌లో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ లభించాల్సి ఉంటుంది. బిల్లు ఆమోదం అనంతరం మంత్రి ప్రధాని నరేంద్ర మోదీ  వివిధ పార్టీల నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ఇదొక చరిత్రాత్మక అడుగు అని, దేశంలోని 671కులాలు దీనివల్ల లబ్ధి పొందుతాయని ఆయన చెప్పారు.

ప్రభుత్వ బీమా సంస్థలను ప్రైవేటీకరించేందుకు వీలుగా తీసుకువచ్చిన ‘ది జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లు 2021కు కూడా పార్లమెంటు ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ నెల 2న ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. బుధవారం విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. 

తృణమూల్, డిఎంకె, వామపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి.సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. అయినా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా విపక్షాల నిరసనల మధ్య మూజువాణీ ఓటుతో బిల్లుకు ఆమోదముద్ర పడింది.

ఒబిసి బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. అంతకు ముందే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో షెడ్యూల్‌కన్నా రెండు రోజుల ముందే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసినట్లయింది.