మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు… హైకోర్టు స్పష్టం

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాన్సాస్‌ చైర్మన్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నలిచ్చింది. 

అశోక్‌గజపతిరాజును పునర్‌ నియమిస్తూ సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై  ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సీజే ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. 

ఈ మేరకు సంచయిత, ఊర్మిళ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది. మాన్సాస్‌ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగుతారని సింగిల్ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సీజే బెంచ్‌ సమర్థించింది. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆనంద జగపతిరాజు మొదటి భార్య కుమార్తె సంచయిత గజపతిని మన్సాస్‌ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజుపై రాష్ట్ర ప్రభుత్వం రహస్య ఉత్తర్వులతో విరుచుకుపడింది. ఆయనను సింహాచల దేవస్థానం చైర్మన్‌గా తొలగించింది.

అలాగే విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి రహస్య ఉత్తర్వులిచ్చింది.

దీనిపై అశోక్‌ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ అశోక్‌ గజపతిరాజును చైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే చైర్మన్‌ నియామకంపై స్టే విధించాలంటూ సంచయిత హైకోర్టును ఆశ్రయించారు. 

అంతేకాకుండా, ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ కూడా తనకెందుకు అవకాశాలు ఇవ్వరంటూ హైకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు తనకూ సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్లపై తాజాగా బుధవారం విచారించిన ధర్మాసనం అశోక్‌ గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని ఆదేశించింది. .