వివేకా హత్యా కేసులో వేగం  పెంచిన సిబిఐ 

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన సమాచారం మేరకు నాలుగైదు రోజులుగా సీబీఐ బృందాలు విచారణలో దూకుడు పెంచాయి. త్వరలోనే  వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు రాఘవరెడ్డి, రమణారెడ్డిలను తొలిసారిగా సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివేకా మొదట గుండెపోటు తోమరణించారని ఎలా చెప్పా రని వారిని ప్రశ్నించినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధిని కూడా పిలిచి గుండెపోటుతో అని ఎలా వార్తలు ప్రసారం చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది.

హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అధికారులు అన్వేషించిన సంగతి తెలిసిందే. చివరికి ఆయుధాలు దొరక్కపోవడంతో అన్వేషణను నిలిపివేశారు. కాగా, ఈ హత్యకు ఆర్థిక మూలాలే కారణంగా సిబిఐ అనుమానిస్తోంది. విచారణలో భాగంగా బుధవారం ఉదయం కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న అతిథి గృహానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది వచ్చారు. వారి వద్ద ఉన్న వివేకాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, రెవెన్యూ రికార్డులను సిబిఐ అధికారులకు ఇచ్చారు.

అనంతరం సిబిఐ అధికారులలో కలిసి వారు వివిధ ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో కడప ఎస్‌బిఐకి చెందిన ముగ్గురు అధికారులను కూడా సిబిఐ విచారించింది. వివేకా కుమార్తె, అల్లుడు కూడా కడపలో సిబిఐ అధికారులను మరోసారి కలిశారు. సిబిఐకు చెందిన మరో బృందం పులివెందులలోని సునీల్‌యాదవ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.