సునీల్ కుమార్‌పై చర్యలు … ఏపీకి కేంద్రం ఆదేశం

వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుకు స్పందించిన కేంద్ర హోంశాఖ ఏపీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

జగన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో రఘురామ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ రాజద్రోహం కేసు మోపారు. బెయిల్‌కు వీలు లేని కేసుల్లో ఒకటైన రాజద్రోహం కేసులో రఘురామను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేయడమే కాకుండా ఆయన్ను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసిన్నట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

ఈ విషయాన్ని రఘురామ స్వయంగా సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కస్టడీలో రఘురామపై సీఐడీ అధికారులు దాడి చేసినట్లు నిర్ధారించింది. దీంతో రఘురామ తనపై కస్టడీలో దాడి చేయించిన సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్‌పై రగిలి పోతున్నారు.

సీఐడీ చీఫ్‌గా సీఎం జగన్ ఏరికోరి తెచ్చుకున్న పీవీ సునీల్ కుమార్‌ను ఎలా టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తున్న రఘురామకు రెండు విషయాలు దొరికాయి. ఇందులో ఒకటి గతంలో పీవీ సునీల్ కుమార్ పై నమోదైన వరకట్నం కేసు కాగా,  మరొకటి ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా చేసిన విద్వేష వ్యాఖ్యలు చేసిన వ్యవహారం.

ఈ రెండు కేసులకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖలు రాసినట్లు తెలుస్తోంది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో పీవీ సునీల్‌కుమార్‌పై ఆయన భార్య పి.అరుణ వరకట్న వేధింపుల కేసు పెట్టారు. దీంతో అప్పటి అధికారులు ఆయనపై వరకట్న వేధింపుల చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ కేసుల్లో తాను అరెస్టు కాకుండా కోర్టుకు వెళ్లి సునీల్ కుమార్ మినహాయింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన ఏపీ సీఐడీ ఛీఫ్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. దీంతో వరకట్న వేధింపుల కేసు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్‌కు సీఐడీ ఛీఫ్ వంటి కీలక పదవి ఎలా అప్పగిస్తారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన రఘురామ.. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు. ఈ ఫిర్యాదులకన్నా ముందే అఖిల భారత సర్వీస్ లో ఉన్న అధికారిగా సునీల్ కుమార్ ఒక మతం వారిని కించపరిచే విధంగా చేస్తున్న విద్వేష ప్రసంగాలకు సంబంధించి రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుపై జూన్ 25న కేంద్ర హోమ్ శాఖ తగు చర్యలు తీసుకోమని సూచిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ వ్రాసింది.

సునీల్ కుమార్ పై రఘురామకృష్ణంరాజుతో పాటు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ అబ్సర్వేటరీ కన్వీనర్ వినయ్ జోషి కూడా గతంలో ఫిర్యాదు చేశారు. అయితే రఘురామరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు  కేంద్ర హోమ్ శాఖ విద్వేష ప్రసంగాల వీడియోలతో కూడిన సీడీని కూడా ఏపీ ప్రభుత్వంకు పంపారు.