పాక్ వీసా నిబంధనలు కఠినతరం కావించాలి

పాకిస్థాన్ వెళ్ళేందుకు వీసాల మంజూరుకు నిబంధనలను కఠినతరం చేయవలసిన అవసరం ఉందని జమ్మూ-కశ్మీరు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ సూచించారు. విద్యాభ్యాసం, ఇతర అవసరాల కోసం పాకిస్థాన్ వెళ్లడానికి వీసాలు తీసుకున్నవారిలో చాలా మంది ఆ దేశంలో ఉగ్రవాదంలో చేరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ వెళ్ళడానికి స్టడీ, ఇతర వీసాల కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాసెస్‌ను కట్టుదిట్టం చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ వెళ్ళి, ఉగ్రవాదంలో చేరిన 57 కేసుల గురించి తమకు తెలుసునని చెప్పారు. 2017, 2018లలో చాలా మంది యువత పాకిస్థాన్ వెళ్లారని తెలిపారు. 

వారిలో చాలా మందికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటువంటి ఉగ్రవాదుల్లో 17 మంది నియంత్రణ రేఖ వెంబడి భారత దేశంలో చొరబడేందుకు ప్రయత్నించగా, వారిని మట్టుబెట్టినట్లు తెలిపారు. 13 మంది క్రియాశీలంగా ఉన్నారని చెప్పారు. 17 మంది ఇంకా తిరిగి రాలేదని తెలిపారు. 

దోడాలో ఉగ్రవాదంలో చేరిన ముగ్గుర్ని వెంటనే పట్టుకున్నామని చెప్పారు. ఉగ్రవాదులతో సంబంధంగల మరొకరి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

కాశ్మీర్ లో ఇద్దరే ఆస్తులు కొన్నారు 

అధికరణ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇద్దరు మాత్రమే జమ్మూ-కశ్మీరులో ఆస్తులు కొన్నారని కేంద్ర ప్రభుత్వం  పార్లమెంటుకు తెలిపింది. అయితే ఆ ఆస్తుల వివరాలను, వాటిని కొన్నవారి పేర్లను వెల్లడించలేదు. జమ్మూ-కశ్మీరులో ఆస్తులను కొనాలనుకునే ఇతర రాష్ట్రాలవారికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. 

జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారు ఇద్దరు మాత్రమే 2019 ఆగస్టు తర్వాత ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఆస్తులను కొన్నారని చెప్పారు. జమ్మూ-కశ్మీరులో ఆస్తులను కొనేటపుడు ఇతర రాష్ట్రాలవారికి ఇబ్బందులు ఎదురైన సందర్భాలు నమోదు కాలేదని తెలిపారు. 

2019 ఆగస్టు 5న అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ-కశ్మీరులో వ్యవసాయేతర భూమిని కొనేందుకు ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందనివారికి అనుమతి ఇస్తూ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో నోటిఫై చేసింది.