కర్ణాటక ప్రభుత్వ కార్యక్రమాల్లో పూలదండలు బంద్

కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాలలో పుష్పగుచ్ఛాలు, పూలదండలు, శాలువాలు లేదా బహుమతులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.  అనవసరమైన ఖర్చుల గ్గింతచాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయ్ ఆదేశాలను అనుసరించి  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి రవి కుమార్ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశారు.  .

వాటికి బదులుగా కన్నడ పుస్తకాలు ఇవ్వవచ్చని సర్క్యులర్‌లోను ప్రభుత్వం పేర్కొంది. అంతకు ముందు రోజు, సీనియర్ పోలీసు అధికారుల సమావేశానికి అధ్యక్షత వహించిన ముఖ్యమంత్రి పూల గుత్తిని అంగీకరించడానికి నిరాకరించారు  ప్రోటోకాల్ పేరుతో దండలు, శాలువలు, పుష్పగుచ్ఛాలు ఇచ్చే అలవాటును విరమించుకోవాలని హితవు చెప్పారు.

ఆ తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం,  ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశాలు,  కార్యక్రమాలలో దండలు, శాలువాలు, పూల బొకేలు, పండ్ల బుట్టలు,  జ్ఞాపికలను ఇవ్వరాదని ప్రధాన కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. అన్ని విభాగాధిపతులు,  ప్రభుత్వ సంస్థలు ఆదేశాలను పాటించాలని కోరినట్లు పేర్కొంది.

జూలై 28 న బాధ్యతలు స్వీకరించిన కొత్త ముఖ్యమంత్రి ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు. నిజానికి, బొమ్మాయి మొదటి  రోజు బ్యూరోక్రాట్‌లతో తన మొదటి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

“ఈ రోజు, కోవిడ్ -19 దృష్టాంతంలో, ఆర్థిక క్రమశిక్షణను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి విభాగంలో అనవసరమైన ఖర్చులను తగ్గించాలి” అని ఆయన తన మొదటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కొనసాగుతున్న కార్యక్రమాలను ప్రభావితం చేయకుండా ఖర్చులో కనీసం 5 శాతం తగ్గింపును సాధించడమే లక్ష్యమని ఆయన చెప్పారు.

ఇటీవల, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఇంధనం, కన్నడ, సాంస్కృతిక శాఖ మంత్రి వి సునీల్ కుమార్ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారికి దండలు,  బహుమతులు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా కన్నడ పుస్తకాలను అడిగారు. వాటిని తన కార్కాల నియోజకవర్గంలోని ఒక లైబ్రరీకి విరాళంగా ఇస్తానని వెల్లడించారు.