కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ మిళితంతో అద్భుత ఫలితాలు 

కరోనా పోరులో భాగంగా ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌. అయితే వీటిని మిళితం చేసిన ప్రయోగాలు చేపట్టిన భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) తొలి అధ్యయన ఫలితాల్లో అద్భుత ఫలితాలు ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.

కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ రెండు డోసులను తీసుకున్న వారితో పోల్చితే… ఈ మిళితమైన వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉందని తేలింది. ఐసిఎంఆర్‌, పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నిర్వహించిన సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌లో గతంలో 18 మందికి రెండు వేర్వేరు టీకాల (కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌) మోతాదులను పొరపాటున ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తులను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. 

ఆ వ్యక్తులలో రోగనిరోధకతను పరిశీలించగా  ఇలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకున్న వాళ్లలో రోగనిరోధకత ఎక్కువగా ఉన్నట్లు ఐసిఎంఆర్‌ తన అధ్యయనంలో గుర్తించింది. అయితే వారు వీటిని అప్పుడు ఉద్దేశ పూర్వకంగా మిళితం చేయలేదు. పొరపాటున జరిగింది. 

అనంతరం పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వీరిని జాగ్రత్తగా పరిశీలించింది. కోవిషీల్డ్‌,కోవాగ్జిన్‌ ఒకేలాంటి డోసులను తీసుకున్న వాళ్లలోని రోగనిరోధక శక్తి, ఆ వ్యాక్సిన్లు ఇచ్చే రక్షణను వీళ్లతో పోల్చి చూసింది. ఈ ఫలితాల్లో రెండు వ్యాక్సిన్లు మిక్స్‌ అయిన వాళ్లలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను తట్టుకునే శక్తి అధికంగా ఉందని వెల్లడైంది. 

 ఒకే ర‌క‌మైన వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వాళ్ల‌లో కంటే ఇలా రెండు వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ల‌లో ఫ‌లితాలు మ‌రింత మెరుగ్గా ఉన్న‌ట్లు తేలింది. ఇలాంటి వాళ్లలో యాంటీబాడీల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.  వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌పై ఎడినోవైరస్‌ ఉపయోగించిన అభివఅద్ధి చేసిన కొవిషీల్డ్‌ను, క్రియారహితం చేసిన వైరస్‌ ఉపయోగించి చేసిన కోవాగ్జిన్‌ మిక్సింగ్‌ మంచి ఫలితాలు ఇచ్చినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ఈ పద్ధతితో టీకా కొరతను కూడా అధికమించవచ్చని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ ఫలితాల్ని స్వతంత్ర నిపుణులు సమీక్షించాల్సి ఉంది.  కాగా.. టీకా మిక్సింగ్ విషయమై కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఇటీవల ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

వివిధ టీకాలను కలిపి ఇవ్వొచ్చని ఈ కమిటీ కూడా జులై 30న సూచించింది. ఇందుకోసం..కొవాగ్జిన్ టీకాకు జతగా ముక్కు ద్వారా ఇచ్చే మరో కరోనా టీకాను ఎంచుకోవాలని కూడా కమిటీ అప్పట్లో సూచించింది.