పోలీస్‌ స్టేషన్లలోనే హక్కుల ఉల్లంఘన ఎక్కువ

దేశంలో పోలీస్ స్టేషనలోనే హక్కుల ఉల్లంఘన, నిర్బంధంలో చిత్రహింసలు ఎక్కువగా జరుగుతున్నాయని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆందోళన వ్యకతం చేశారు. సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉన్నవారిపై కూడా థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ పోలీస్‌ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 

అవసరమైన సమయంలో న్యాయసాయం అందకపోవడం వల్ల పోలీస్‌ కస్టడీలో ఉన్నవాళ్లు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. మానవ హక్కులపై, ఇందుకు సంబంధించిన చట్టాలపై పోలీసులకు అవగాహన కోసం నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (నల్సా) దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టాలని సూచించారు. పేదలకు న్యాయసాయం అందించడం కోసం రూపొందించిన నల్సా మొబైల్‌ యాప్‌ను ఆదివారం జస్టిస్‌ రమణ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్య సమాజం ఎటువంటి థర్డ్‌డిగ్రీ ప్రయోగాన్ని హర్షించబోదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక హక్కులు ఉన్న వారిపట్ల కూడా చిత్రహింసల పర్వం సాగినట్లు వార్తలు వెలువడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులలో సముచితరీతిలో పరివర్తన దిశలో నల్సా దృష్టిసారించాల్సి ఉందని సూచించారు.

పోలీసు స్టేషన్లలో వ్యక్తులకు సంబంధించి సమర్థవంతమైన చట్టపర న్యాయపర ప్రాతినిధ్యానికి వీలు లేకపోవడం నిందితులకు సంబంధించి ప్రధానమైన చిక్కుగా మారుతోందని జస్టిస్ రమణ తెలిపారు. అందరికీ న్యాయం, న్యాయం అందుబాటులోకి రావడం అనేది నిరంతర ప్రక్రియ అని, దీనికి అంతం అనేది ఉండదని పేర్కొన్నారు. న్యాయం చట్టం సముచిత రీతిలో వర్థిల్లేందుకు మనం ఎంచుకునే ప్రమాణం ఒక్కటే అని చెప్పారు. 

సమాజంలో చట్టబద్ధ పాలన సాగాలంటే న్యాయసాయం పొందడంలో పేదలకు, ధనికులకు మధ్య ఉన్న అంతరం తొలగిపోవాలని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ, చట్టాలు తమకోసమే ఉన్నాయన్న భావన ప్రజల్లో కలగాలని పేర్కొన్నారు. చాలా కాలంగా పేదప్రజలు న్యాయవ్యవస్థకు ఎంతో దూరంగా ఉండిపోయారని తెలిపారు. 

గతంలో జరిగిన విషయాలు భవిష్యత్తును నిర్ణయించబోవని, న్యాయ సమానత్వం కోసం ప్రతీ ఒక్కరు పనిచేయాలని సూచించారు. న్యాయం పొందడంలో రాజ్యాంగపరమైన హక్కులు, న్యాయ సేవల లభ్యతపై ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో డిస్‌ప్లే బోర్డులు పెట్టడం, అవసరమైన వారికి సాయం అందించడం ఈ దిశగా ఒక ముందడుగు అని చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయాలు అంతగా లేకపోవడం వల్ల న్యాయ సహాయానికి అవరోధం ఏర్పడుతున్నదని చెబుతూ  ఈ విషయంపై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి లేఖ రాశానని వెల్లడించారు. బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సేవలు అందించే ఉద్దేశంతో 1987లో లీగర్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ చట్టం కింద నల్సా తెచ్చారు.