జడ్జిలపై అనుచిత వాఖ్యల కేసులో ఇద్దరు వైసిపి నేతలు!

ఎపి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐదుగురిని సిబిఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. శనివారం పి.ఆదర్శ్‌, ఎల్‌ సాంబశివరెడ్డిని అధికారులు అరెస్ట్‌ చేయగా.. జులై 28న ధామిరెడ్డి కొండారెడ్డి, పాముల సుధీర్‌ను, అదే నెల 9న లింగారెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 

ఆదర్శ్‌, సాంబశివరెడ్డిని కోర్టులో ప్రవేశ పెట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 16 మందిపై కేసులు నమోదు చేశామని, వారిలో ఐదుగురు అరెస్టు కాగా.. మరో ముగ్గురు విదేశాల్లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో వైసిపికి చెందిన ఎంపి నందిగం సురేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ పేర్లూ వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారిద్దరిని సిబిఐ విచారించింది . 

ఈ కేసుకు సంబంధించి వారి ప్రమేయంపైనా దర్యాప్తు జరుపుతున్నామని సిబిఐ అధికారులు తెలిపారు. అది తేలాక వారిపై కూడా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాపారు. జడ్జీలపై వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తున్నట్లు సిబిఐ అధికార ప్రతినిధి ఆర్‌సి జోషి ఈ సందర్భంగా తెలిపారు.

“వీటి వెనుక పెద్ద కుట్ర ఉన్నదనే అంశంపై దర్యాప్తు చేయడానికి, ఒక ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యేతో సహా కొంతమంది వ్యక్తులను కూడా సిబిఐ పరిశీలించింది. ఎఫ్ఐఆర్ లో పేర్కొనబడని ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగింది” అని సిబిఐ ప్రతినిధి ఆర్ .సి. జోషి పేర్కొన్నారు.

“ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన కొన్ని కోర్టు తీర్పులను అనుసరించి, న్యాయమూర్తులను ఉద్దేశించి నిందితులు సామాజిక మాధ్యమాలలో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థలకు వ్యతిరేకంగా అవమానకరమైన పోస్ట్‌లు చేశారని ఆరోపించబడింది” అని జోషి చెప్పారు.
కేసు నమోదు చేసిన తర్వాత, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 16 మంది నిందితుల్లో 13 మందిని సిబిఐ వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో గుర్తించిందని ఆయన చెప్పారు.

“వారిలో ముగ్గురు విదేశాలలో ఉన్నట్లు కనుగొనబడింది. పైన పేర్కొన్న 13 మంది నిందితులలో 11 మందిని సిబిఐ ఇప్పటివరకు పరిశీలించింది. వారిలో ఐదుగురిని అరెస్టు చేసింది. మిగిలిన ఆరుగురు నిందితులపై ఆధారాలు తదుపరి అవసరమైన చట్టపరమైన చర్యల కోసం కసరత్తు చేస్తున్నాము. విదేశాలలో ఉన్న మరో ఇద్దరిని ప్రశ్నించడానికి కూడా సిబిఐ ప్రయత్నిస్తోంది “అని జోషి చెప్పారు.

ఏజెన్సీ నిందితుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి, వారిలో ఒకరు వేరే పేరుతో పాస్‌పోర్ట్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం వచ్చిందని ఆయన చెప్పారు. సోదాల సమయంలో కీలక పత్రాలు కూడా లభించినట్లు తెలిపారు. “సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిక్ డొమైన్‌ల నుండి అభ్యంతరకరమైన పోస్ట్‌లను తీసివేయడానికి ఈ కేసును నమోదు చేసిన తర్వాత సిబిఐ కూడా చర్యను ప్రారంభించింది.  అలాంటి అనేక పోస్ట్‌లు లేదా ఖాతాలు ఇంటర్నెట్ నుండి తీసివేశారు అని జోషి వివరించారు. 

న్యాయమూర్తులపై దాడులు, దూషణలు అధికం అవుతున్నాయని, సిబిఐ, ఐబి సంస్థలు న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత సిబిఐ ఈ కేసులో ఈ అరెస్టులను వెల్లడిస్తూ, దూకుడు పెంచినట్లు కనిపిస్తున్నది.

న్యాయస్థానానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ, న్యాయమూర్తులను దూషిస్తూ, వారిని ముక్కలుగా నరకాలి అని హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా రకరకాలుగా దూషించిన వారిపై ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టు చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు జారీ చేసింది. వీరిలో ఎంపి నందిగం సురేశ్, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.

వైసీపీ అభిమానులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా జడ్జిలను తీవ్ర అసభ్య, అసహ్య పదజాలంతో దూషించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎపి హైకోర్టు కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయస్థానం, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ‘కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు.