అమరావతి గ్రామాల్లో పోలీస్ ఆంక్షలు… ఉద్యమకారుల అరెస్ట్ 

అమరావతి రాజధాని పరిరక్షణకోసం రాజధానికి తమ భూములను ఇచ్చిన రైతుల ఉద్యమం ప్రారంభమై ఆదివారంతో 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి పరిరక్షణ సమితి, రైతు కార్యాచరణ సమితి, దళిత జెఎసి, మహిళా, యువజన జెఎసి ఉద్యమ కార్యాచరణను నిన్న ప్రకటించాయి. 

అమరావతి ఆకాంక్షను ప్రభుత్వానికి తెలుపుతూ జెఎసి ఆధ్వర్యంలో రాజధాని రైతులు, మహిళలు ఆదివారం బైక్‌ ర్యాలీకి సన్నద్ధమయ్యారు. హైకోర్టు సమీపంలోని న్యాయమూర్తుల గృహ సముదాయాల నుండి మంగళగిరి పానకాల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీకి పిలుపుఇచ్చారు. 

అయితే ఆదివారం ఉదయం నుండి రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు. 

పెదపరిమి వద్దే మీడియా ప్రతినిధుల వాహనాలను నిలిపివేశారు. మీడియాకు పోలీసులు సహకరించాలని ఎస్పీ విశాల్‌ గున్నీ కోరారు. మరోవైపు విజయవాడ- అమరావతి మార్గంలోనూ అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. 

పలు చోట్ల నిరసనలకు దిగిన అమరావతి ఉద్యమకారులు, టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. తాడేపల్లిలో పలువురు టిడిపి కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ప్రకాశం బ్యారేజీ సహా కరకట్ట వెంట పోలీసులు మోహరించారు. కరకట్టపై 4 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే విడిచి పెడుతున్నారు.

అమరావతి పరిధిలోని తుళ్లూరు రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు దీక్షా శిబిరం నుంచి మంగళగిరి ఆలయానికి బైక్ ర్యాలీని ప్రారంభింస్తుండగా పోలీసులు ముళ్లకంచెలు వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో దీక్షా శిబిరంలో ఉన్న మహిళలు, రైతులు హైకోర్టు వైపు పరుగులు తీశారు. 

పరుగులు తీస్తున్న వారిని మళ్లీ అడ్డుపడటంతో.. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని పోలీసులను నిలదీశారు. దీంతో ఆగ్రహం చెందిన పోలీసులు దళిత నాయకురాలు కంభంపాటి శిరీషను అడ్డుకుని శిరీషను రోడ్డుపై ఈడ్చుకుంటూ జీప్‌లో ఎక్కించారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు రైతు శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మంగళగిరి లక్ష్మినరసింహస్వామి ఆలయానికి వచ్చే రహదారులలో పోలీసులు మోహరించారు. పలుచోట్ల రహదారులపై ముళ్లకంచెలు వేయడంతో సాధారణ ప్రజానీకం తీవ్ర అసౌకర్యానికి గురౌతోంది. ఎట్టి పరిస్థితుల్లో నిరసనర్యాలీ ఆలయం వైపు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అమరావతికి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరులో సోదాలు చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.