టిటిడి చైర్మన్ గా మరోసారి సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి చైర్మన్‌గా తన చిన్నాన్న  వైవీ సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఆ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువును జారీచేసింది. అయితే పాలకమండలి సభ్యులను మాత్రం ఇవాళ ప్రభుత్వం ప్రకటించలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కమిటీ నియామకం ఉంటుందని తెలుస్తోంది.

జూన్ లోనే తన రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్న సుబ్బారెడ్డి  తనకు తిరిగి ఈ పదవిలో కొనసాగడం పట్ల ఆసక్తి లేదని స్పష్టం చేశారు. రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరింప దలఁచిన్నట్లు తన మద్దతుదారులవద్ద బహిరంగంగానే తన అభిలాషను వ్యక్తం చేశారు.  ముఖ్యమంత్రిని కూడా కలసి తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. 

ఎమ్యెల్సీగా ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో చేరడంతో, రాజ్యసభకు ఎన్నికై ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించడమో చేయాలి అనుకొంటున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే అక్కడే ఆయన ఇరకాటంలో పడ్డారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకొంటే తన మరో సమీప బంధువైన బి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి తొలగింప వలసి వస్తుంది. రాజ్యసభకు పంపితే తనకు సన్నిహితుడైన విజయసాయిరెడ్డి ప్రాధాన్యత ఢిల్లీలో తగ్గిపోతుంది. 

అందుకనే టిటిడి పదవిలో కొనసాగమని చిన్నానను జగన్ చివరకు ఒప్పించినట్లు తెలుస్తున్నది. మరోవంక పాలకవర్గంలో సభ్యత్వం కొరకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటకలతో పాటు పలు రాష్ట్రాల నుండి బలమైన వత్తిడులు వస్తుండడంతో జగన్ ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. ఈ వత్తిడుల ఫలితంగానే ఇంతకు ముందు సభ్యుల సంఖ్యను 18 నుండి 37కు పెంచారు. 

ఇప్పుడు కనీసం 75 మంది నుండి బలమైన వత్తిడులు వస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఇవాళ చైర్మన్‌ను నియమించినప్పటికీ పాలక మండలి సభ్యులను నియమించలేదని తెలుస్తున్నది. ఇప్పుడు మరోసారి పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.