ఏక్షణంలో బెయిల్ రద్దవుతుందో తెలియని జగన్… బిజెపి ఎద్దేవా 

ఒక వంక సిబిఐ, ఇడి  నమోదు చేసిన కేసులలో ఎప్పుడు బెయిల్ రద్దయి, జైలుకు  వలసి వస్తుందో తెలియక అయోమయంలో చిక్కుకున్న  ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర పరిపాలనను గాలికి వదిలేశారు. ఏరోజుకారోజు ఖర్చులకు సహితం డబ్బు వెతుక్కోవలసిన దుస్థితిలో  రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో చిక్కుకు పోయేటట్లు చేశారు.

అట్లాంటి జగన్ మంత్రివర్గ సమావేశంలో మంత్రులను బిజెపిపైకి రెచ్చగొట్టి, తమ ప్రభుత్వాన్ని కూల్చేయడం కోసం బిజెపి కుట్రలు పన్నుతున్నదని అంటూ మంత్రులచేత ఆరోపణలు చేయించడం పట్ల బిజెపి తీవ్రంగా స్పందిస్తున్నది. వేలకోట్ల అవినీతితో నిలువునా మునిగిపోయిన జగన్ తమపై బురద చల్లడం ఏమిటంటూ నిలదీస్తున్నది.

మరోవంక పార్లమెంట్ వేదికగా బిజెపిని ఇరకాటంలో పెట్టడం కోసం అన్నట్లు ఆ పార్టీ ఎంపీలు పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాలపై బిజెపిని లక్ష్యంగా చేసుకొని నిరసనలు వ్యక్తం చేస్తుండడం పట్ల కూడా బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది.

గత ఎన్నికలలో జగన్ కు సహాయకారిగా ఉన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరబోతూ, జగన్ ను సహితం ఆ పార్టీకి దగ్గరకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసిపి ఎంపీలు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతెన్నుల పట్ల బిజెపి నాయకత్వం సీరియస్ అవుతున్నది.

వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని ఆరోపించారు. కాషాయం కప్పుకొన్న వ్యక్తిని సీఎంను చేయాలని కలలు కంటోందని ఎద్దేవాచేశారు.

మరుసటి రోజే ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బీజేపీ మతతత్వ పార్టీ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీలో ఏదో ఒక రకంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని, రాష్ట్రంలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్‌ బాషా ద్వజమెత్తారు. 

మీ ప్రభుత్వాన్ని తాము కూల్చనవసరం లేదని, ఆ ఆలోచన కూడా తమకు లేదంటూ బిజెపి రాష్ట్ర సహా ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ తన ట్వీట్ లో ఘాటుగా స్పందించారు. ఏక్షణం బెయిల్ రద్దవుతుందో తెలియక, అప్పు పుట్టక రోజులు గడవలేని దుస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 

కేంద్రం అప్పులు చేసినా కోట్లాదిమందికి ఉచితంగా రేషన్, టీకాలు ఇస్త్తున్నదని  కేంద్రనాయుకున్న ఆర్ధిక స్థోమత, వెసులుబాటు మీ ప్రభుత్వానికి ఉన్నదా అంటూ ఎదురు దాడి చేశారు. మీలా పప్పుబెల్లాలు పంచడానికి అప్పులు చేయడం లేదని, తాము దేశ ప్రతిష్ట పెంచుతుంటే మీరు రాష్ట్రాన్ని ముంచుతున్నారని అంటూ మండిపడ్డారు. 

బిజెపి ప్రజల పక్షాన పోరాడుతుంటే వైసిపి నాయకులు ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఖంగారు పడిందో, ఆశీర్వదించిందో తెలియదు గాని అస్థిరతకు లోనవుతున్నదని స్పష్టమ చేశారు. తాము ప్రజలకు సేవ్ చేస్తే వైసిపి నేతలు ఖంగారు పడుతున్నారని అంటూ ధ్వజమెత్తారు.

అభద్రతా భావంతోనే బీజేపీపై జగన్‌ ప్రభుత్వం నిందలు వేస్తోందని బీజేపీ నేత సీఎం రమేష్‌ ఆరోపించారు. మద్యపాన నిషేధాన్ని ప్రకటించి మద్యం విక్రయాలను ప్రభుత్వం పెంచిందని ధ్వజమెత్తారు. కాగ్‌కి ఫైనాన్స్‌ రిపోర్ట్ ఇవ్వలేదని అంటూ  సీఎఫ్‌ఎమ్మెస్ సిస్టం గత నాలుగు నెలలుగా పనిచేయట్లేదా అని రమేష్‌ ప్రశ్నించారు.

 బీజేపీ మతతత్వ పార్టీ అని మంత్రులు మాట్లాడతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏపీ ఆర్థిక పరిస్థితిపై గత వారం బీజేపీ చీఫ్‌ నడ్డాతో చర్చించానని చెబుతూ పార్లమెంట్‌ సమావేశాల అనంతరం యూపీ, ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి  పెడుతోందని వెల్లడించారు. ఏపీలో ఈ నెల లేదా వచ్చే నెలలోపు  రాజమండ్రి, తిరుపతిలో జరిగే సభలలో అమిత్ షా, జెపి నడ్డా పాల్గొంటారని తెలిపారు.  

ఆడలేక మద్దెల మీద పడినట్లు వైసిపి వ్యవహారం ఉన్నదని అంటూ బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు  తీర్చలేక,కేంద్రంపై నిందలు మోపి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.