
బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌కు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ షాక్ ఇవ్వనున్నారని వార్తలొచ్చాయి. ఆయనను ఆర్థికశాఖ నుంచి ఆరోగ్య శాఖకు మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జాన్సన్ చెప్పారని ఆ వార్తా కథనాల సారాంశం. భారత సంతతికి చెందిన రిషి సునాక్.. భారత్ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు కావడం గమనార్హం.
దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని, కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన ప్రయాణ ఆంక్షలను సడలించాలని కోరుతూ బోరిస్ జాన్సన్‌కు రిషి సునాక్ లేఖ రాశారు. ఈ లేఖ గతవారం మీడియాలో రావడంపై జాన్సన్ ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. గత ఆదివారం సన్‌డే టైమ్స్‌లో రిషి సునాక్ రాసిన లేఖ ప్రచురితమైంది.
ఈ విషయమై తొలుత ఆగ్రహంతో ఊగిపోయిన జాన్సన్.. కోపం తగ్గిన తర్వాత స్పందిస్తూ శక్తిమంతమైన ఆర్థిక శాఖ నుంచి రిషి సునాక్‌ను ఆరోగ్య శాఖకు మార్చేస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో జాన్సన్ సమక్షంలో సుమారు డజన్ మంది అధికారులు ఉన్నారని అధికార వర్గాల కథనం.
త్వరలో రిషి సునాక్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా చూడొచ్చు. జాన్సన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెప్పాయి. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. ప్రైవేట్ సంభాషణలపై స్పందించబోమన్నాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రిషి సునాక్ ద్రుష్టి సారించారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఆర్థిక రంగ రికవరీ సాధించడంతోపాటు ఉద్యోగాలను కాపాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ వర్గాల కథనం.
More Stories
అమెరికాలో ఒకేసారి 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!
ముజిబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసంపై దాడి
గాజా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటన