
ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా (గుడ్‌బై) చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట్లు తమ జాతీయ పతాకాలతో స్టేడియంలోకి వచ్చారు. భారత్ తరఫున బ్రాంజ్ మెడల్ విన్నర్, రెజ్లర్ భజరంగ్ పూనియా త్రివర్ణ పతాకంతో సందడి చేశాడు.
కరోనా మహమ్మారి వణికస్తున్న సమయంలో విజయవంతంగా ఈ విశ్వక్రీడా సంబరాన్ని నిర్వహించిన టోక్యోకు అథ్లెట్లు కృతజ్ఞతలు తెలిపారు. క్లోజింగ్ సెర్మనీ ప్రారంభంలో జపాన్ క్రౌన్ ప్రిన్స్ అకిషినో, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్‌తో కలిసి స్టేడియంలోకి వచ్చారు.
కరోనా నేపథ్యంలో ఏడాది వాయిదా పడి, అసాధారణ పరిస్థితుల్లో ప్రేక్షకులను అనుమతించకుండా జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స్ ఇవే కావడం విశేషం. గేమ్స్ ప్రారంభానికి ముందు టోక్యోలో ఎమర్జెన్సీ పరిస్థితులు, గేమ్స్ విలేజ్‌లో అథ్లెట్లు కొవిడ్ బారిన పడినా మొత్తానికి రెండు వారాల పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్ ఘనంగా ముగిశాయి.
ఎప్పటిలాగే ఈసారి కూడా మెడల్స్ జాబితాలో టాప్‌లో ఉండటానికి అమెరికా, చైనా మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. గేమ్స్‌లో చాలా రోజుల వరకూ టాప్‌లో ఉన్న చైనాను చివరి రోజు అమెరికా వెనక్కి నెట్టడం విశేషం. శనివారం వరకూ చూస్తే చైనా 38 గోల్డ్ మెడల్స్‌తో టాప్‌లో ఉండగా.. అమెరికా ఖాతాలో 36 మాత్రమే ఉన్నాయి.
అయితే ఆదివారం బాస్కెట్‌బాల్, వాలీబాల్‌లతోపాటు సైక్లిస్ట్ జెన్నిఫర్ వాలెంటీ కూడా గోల్డ్ గెలవడంతో అగ్రరాజ్యం మళ్లీ టాప్‌లోకి వెళ్లింది. ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్‌తో అమెరికా ముగించడం ఇది వరుసగా మూడోసారి. రికార్డు స్థాయిలో 600కుపైగా అథ్లెట్లతో బరిలోకి దిగిన అమెరికా మొత్తానికి తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
అమెరికా ఖాతాలో 39 గోల్డ్ మెడల్స్‌తోపాటు మొత్తం 113 మెడల్స్ ఉన్నాయి. గోల్డ్‌మెడల్ పరంగా చూసినా, మొత్తంగా చూసినా అమెరికానే టాప్‌లో ఉంది. అయితే రియోగేమ్స్‌లో అమెరికాకు 121 మెడల్స్ వచ్చాయి. అందులో 46 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఆ గేమ్స్‌తో పోలిస్తే ఈసారి అగ్రరాజ్యం ప్రదర్శన అంత మెరుగ్గా లేదనే చెప్పాలి.
అంతేకాదు ఆధునిక గేమ్స్ చరిత్రలో తొలిసారి అమెరికాకు ట్రాక్ ఈవెంట్‌లలో ఒక్క వ్యక్తిగత గోల్డ్ మెడల్ కూడా రాలేదు. ఇక చైనాతో 38 స్వర్ణాలతోపాటు మొత్తం 88 మెడల్స్‌తో రెండోస్థానంతో సరిపెట్టుకుంది. గోల్డ్ మెడల్స్ పరంగా జపాన్ (27), బ్రిటన్ (22), రష్యన్ ఒలింపిక్ కమిటీ (20) టాప్ 5లో ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పరిస్థితి చాలా మెరుగైందనే చెప్పాలి. రియో గేమ్స్‌లో 67వ స్థానంతో సరిపెట్టుకున్న భారత్.. ఈసారి ఏకంగా 19 స్థానాలు ఎగబాకింది. ఈసారి కూడా శనివారం ఉదయం వరకూ 66కి అటుఇటూగా ఉంటూ వచ్చింది. అయితే జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌తో ఒకేసారి 47వ స్థానానికి వచ్చింది.
ఆదివారం ఆటలు ముగిసే సమయానికి ఒక స్థానం దిగజారి 48తో సరిపెట్టుకుంది. భారత్ ఖాతాలో 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ సహా మొత్తం 7 మెడల్స్ ఉన్నాయి. ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన అత్యధిక మెడల్స్ ఇవే కావడం విశేషం.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి